ప్రజలకు చట్టాలపై అవగాహన అవసరం
ఆలేరు మండలంలోని మూడు గ్రామాల్లో న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమాలు
ఆలేరు,(విజయక్రాంతి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి(Secretary of District Legal Services Authority) మాధవి లత సూచనల మేరకు ఆలేరు మండలంలోని కొల్లూరు, గొలనుకొండ, కొలనుపాక గ్రామాల్లో న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా వయోవృద్ధుల పోషణ చట్టం(Maintenance of Senior Citizens Act) తదితర చట్టపరమైన అంశాలను వివరించి, అవసరమైనప్పుడు న్యాయ సేవాధికార సంస్థ సహాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. న్యాయపరమైన సమస్యలు, సందేహాల పరిష్కారం కోసం న్యాయ సేవాధికార సంస్థ టోల్ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి. ప్రసాద్ గౌడ్, న్యాయవాది శివకుమార్, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ నారగోని రాజశేఖర్, గంధం నాగరాజ్, పారా లీగల్ వాలంటీర్ ఎం.డి. మౌలానా తదితరులు పాల్గొన్నారు.