జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం
హనుమకొండ, నవంబర్ 18 (విజయ క్రాంతి): జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం(National Epilepsy Day) సందర్భంగా భార్గవ న్యూరో క్లినిక్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి హన్మకొండ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ లో తెలంగాణ ఫిజియోథెరపీ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ మూర్ఛ వ్యాధి పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, ప్రజల్లో సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.మూర్ఛ వ్యాధి అంటువ్యాధి కాదని, సరైన వైద్య పరీక్షలు, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స, క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని తెలిపారు.
మూర్ఛ వచ్చిన వ్యక్తులను చూసి భయపడకుండా, వారికి సరైన ప్రథమ చికిత్స అందించి వెంటనే వైద్య సహాయం పొందేలా చూడాలని సూచించారు.విద్యార్థులు, యువత ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని, నాడీ సంబంధిత వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్యులు, ఫిజియోథెరపీ నిపుణులు, విద్యాసంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు డాక్టర్ రాము వొడితెల , డాక్టర్ క్రాంతి, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ శివరామకృష్ణ, ప్రొఫెసర్ సుస్మిత, వరంగల్ జిల్లా ఫిజియోథెరపీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ వంశీ, డాక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.