బియ్యం ధరలను అదుపులో పెట్టాలి
- రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి
- హనుమకొండలో సీపీఐ భారీ ధర్నా
హనుమకొండ అర్బన్ (విజయక్రాంతి): నిత్యావసర వస్తువుల ధరలు(Prices of essential commodities) ఆకాశాన్నంటుతున్నాయని, తక్షణమే బియ్యం ధరలను ప్రభుత్వం అదుపులో పెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ(Communist Party of India) రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. బియ్యం ధరలను అదుపు చేయకుంటే అక్రమ నిల్వలపై సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు.
ధరల నియంత్రణ, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం తదితర డిమాండ్లతో సీపీఐ ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ లో బుధవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ కృత్రిమ కొరత సృష్టిస్తూ వ్యాపారులు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతున్నారని,
దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపులోకి తీసుకురావాలని, అక్రమంగా నిల్వ చేసిన గోదాములపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు అన్ని రకాల నిత్యావసర సరుకులను పప్పులు, నూనె, చక్కెర మొదలైనవి, సబ్సిడీపై పంపిణీ చేయాలని, ప్రజల ఆకలి కేకలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి,
మండల కార్యదర్శి ఎన్. అశోక్ స్టాలిన్, మండల సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, నాయకులు అలకుంట్ల యాకయ్య, పొనుగోటి రాముగోపాల్ చారి, పూజారి అమృతయ్య, పొక్కుల సదానందం, కోడెపాక బాబు, మామునూరి దామోదర్, నోముల కిశోర్, మాలోత్ మంగ, కేతపాక ప్రసాద్, తాటికంటి మమత, అలకుంట్ల మల్లయ్య, కనకం కావ్యశ్రీ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.