ముఖ్యమంత్రి వివక్ష చూపొద్దు..

18-11-2026 | 06:36pm
  1. పేదల సొమ్ము పేదలకే చెందాలి.. గత ప్రభుత్వ అవినీతిని వెలికితీయాలి
  2. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన రూ.4 వేల పింఛన్‌ హామీని నిలబెట్టుకోవాలి
  3. కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో ప్రజలు సంతోషంగా లేరు

మునుగోడు,నవంబర్ 18 (విజయక్రాంతి): వెనకబడిన మునుగోడు నియోజకవర్గానికి(Munugode constituency) గత ప్రభుత్వాల వలె వివక్షత చూపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మునుగోడుకు నిధులు మంజూరు చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) ప్రభుత్వాని హెచ్చరించారు. సొంత ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

బుధవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయడం లేదని, మునుగోడు నియోజకవర్గంపై వివక్ష చూపొద్దని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యేగా అభివృద్ధి నిధులు కోరుతున్న తనకు సహకరించాల్సిందిపోయి 'పండబెట్టి తొక్కుతా' అని అనడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. మునుగోడు అభివృద్ధికి నిధులు నిలిపివేస్తే మరో కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు. మునుగోడు, గట్టుప్పల్‌, మర్రిగూడ, నాంపల్లి, చండూరు మండలాలతో పాటు చండూరు మున్సిపాలిటీలో నూతనంగా ఎంపికైన 3,630 మంది లబ్ధిదారులకు పింఛన్‌ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' ఆలపించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు తదితర వర్గాలకు చెందిన లబ్ధిదారులు పింఛన్‌ మంజూరు పత్రాలు అందుకున్నారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 90 శాతం మందికి పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. పింఛన్ల ఎంపికలో తాము ఎలాంటి రాజకీయ జోక్యం చేసుకోలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.

ప్రభుత్వ సొమ్ము పేదలకు చేరాలే తప్ప అనర్హుల చేతుల్లోకి వెళ్లకూడదన్నారు.కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పింఛన్‌ను రూ.4 వేలకు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ఒకసారి మాట ఇస్తే తప్పక నిలబెట్టుకోవాలన్న వైఎస్సార్‌ స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు సాగాలని సూచించారు.

ఇచ్చిన హామీని అమలు చేయలేకపోతే అందుకు గల కారణాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. పింఛన్‌ రూ.2 వేలు కాకుండా రూ.5 వేలు ఇచ్చినా తప్పులేదని, ప్రతి మండల కేంద్రంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు.

గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అప్పులు చేసి, కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చిందని, ఆర్థిక అవకతవకల కారణంగా ప్రస్తుత ప్రభుత్వం అప్పుల భారం ఎదుర్కొంటోందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసి ప్రజాధనాన్ని రికవరీ చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

గత ప్రభుత్వ తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం పునరావృతం చేయకూడదని హితవు పలికారు. వ్యవసాయం చేసే నిజమైన రైతులకే రైతుబంధు వంటి పథకాల ప్రయోజనం అందాలని, ప్రభుత్వ నిధులు అర్హులైన పేదలకు, రైతులకు చేరాలని స్పష్టం చేశారు.మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించి ఆరు నెలల పాటు కొనసాగించినా నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసి వెళ్లిపోతున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని, ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా పాలన సాగించాలని కోరారు. కొడంగల్‌, మధిర నియోజకవర్గాలకే తెలంగాణ పరిమితం కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు కాదు, రూ.20 వేల కోట్లు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, అదే సమయంలో మునుగోడు అభివృద్ధికి కూడా తగిన నిధులు కేటాయించాలని కోరారు.తాను కాంగ్రెస్‌ పార్టీకి, రాహుల్‌గాంధీకి విధేయుడినేనని, అయితే నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

పదవుల కోసం తాను పాకులాడటం లేదని, ప్రజల కోసం, పేదల హక్కుల కోసం రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. తన కుటుంబానికి భగవంతుడి దయవల్ల ఎలాంటి లోటు లేదని, ప్రజలకు న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా, నిజాయితీగా వ్యవహరించినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో మూడేళ్ల పాలన అనంతరం ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే, ప్రభుత్వంలో ఉన్నవారు పేదల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. గతంలో అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారని, అదే దోపిడీ విధానం పునరావృతమవుతోందని ఆరోపించారు.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారుల ఆధిపత్యమే కొనసాగుతోందని విమర్శించారు.తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతానని, అలా మాట్లాడటాన్ని మంత్రి పదవి రాలేదన్న ప్రచారంతో ముడిపెట్టడం సరికాదన్నారు.

ప్రజల మంచి కోసమే తన గళం వినిపిస్తానని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని పేర్కొంటూనే, మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.

పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేదికగా సంక్షేమ పథకాల అమలు నుంచి ప్రభుత్వ ఆర్థిక విధానాలు, అభివృద్ధి నిధుల కేటాయింపు వరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి.

మరిన్ని వార్తలు