బీసీ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలి
వరంగల్, (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాకి కేంద్రమైన హనుమకొండలో బీసీ సామాజిక వర్గాలు సమావేశాలు(Meetings of BC community groups) నిర్వహించుకోవడానికి ఒక సమావేశ హాల్ కేటాయించాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి(MLA Naini Rajender Reddy) విజ్ఞప్తి చేశారు.
2025 సెప్టెంబర్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హన్మకొండ కలెక్టర్ బీసీ భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని, 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రతి జిల్లాలో బీసీ సామాజిక వర్గాల కోసం 50 కోట్ల రూపాయలతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
బిసి భవన నిర్మాణానికి స్థల కేటాయింపు అనుమతుల విషయంలో జాప్యం జరిగే అవకాశాలు లేకుండా, బీసీ సామాజిక వర్గాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ భవనాన్ని కేటాయించడానికి సహకరించాలని కోరారు. పబ్లిక్ గార్డెన్ దగ్గర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భవనాన్ని ఉపయోగించటం లేదని, ఆ భవనంలో కొంత భాగాన్ని తాత్కాలికంగా బీసీ భవన్ కి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బీసీ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయింపుకి కృషి చేస్తానని అప్పటివరకు బిసి సామాజిక వర్గాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ భవనాన్ని కేటాయించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.