ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై బిజెపి విస్తృతస్థాయి సమావేశం
హనుమకొండ, నవంబర్ 06 (విజయక్రాంతి): వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియపై శుక్రవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్ సెంటర్ లో వరంగల్, హనుమకొండ జిల్లాల విస్తృతస్థాయి సమావేశం బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి(Kolanu Santhosh Reddy) అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి అంజిరెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేయడంపై మరియు రాబోయే భవిష్యత్ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించేలా పార్టీ శ్రేణులు పూర్తి సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాయకురాలు రావు పద్మ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జిడబ్ల్యూఎంసి ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ విస్తృతస్థాయి సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు, పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల, డివిజన్ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.