డ్రామాలు ఆపండి
డైవర్షన్ రాజకీయాలతో జనం విసిగిపోయారు
ప్రజా సమస్యలపై చర్చించాలి.. సభా సమయాన్ని వృథా చేయొద్దు
పోలీసులపై దాడి చేసిన నేతలకు జైలే
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ప్రజా సమస్యలను పక్కనపెట్టి డైవర్షన్ రాజకీయాలు చేయడం ఆపాలని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను చూసి జనం అసహించుకుంటున్నారని, రెండు రోజులు ఒకే అంశంపై సభా సమయాన్ని వృథా చేయడం దుర్మార్గమన్నారు. ఇకనైనా డ్రామాలు ఆపి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
స్పీకర్‌ను బీఆర్‌ఎస్ నేతలు అసభ్య పదజాలంతో దూషించడం దారుణమని, వారి తీరు ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేని విధంగా ఉందన్నారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వంటి సీనియర్ ఎమ్మెల్యేలపై పోలీసులు అనుసరించిన తీరు కూడా సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన చేస్తే పోలీసులతో అడ్డుకోవడం మూమ్మాటికీ తప్పే అన్నారు. అయితే విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై బీఆర్‌ఎస్ నేతలు దాడికి దిగడం, బూతులు తిట్టడం తగదని, వారిని జైలుకు పంపాల్సిందేనని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ నల్లచొక్కా ధరించి పార్లమెంట్‌కు రాలేదా, కాంగ్రెస్ పార్టీకి అక్కడో రూల్, ఇక్కడో రూల్ వుంటుందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రతిపక్ష హోదాకు బీఆర్‌ఎస్ అనర్హం
బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండే అర్హతను ఎప్పుడో కోల్పోయిందని, అసెంబ్లీకే రాని కేసీఆర్‌కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎందుకన్నారు. ఎర్రవల్లి ఫాంహౌజ్‌స్‌పై దాడి, కేసీఆర్‌పై హత్యాయత్నం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ఎర్రవల్లిలోనైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేసీఆర్ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు కలిసి కాంప్రమైజ్ పాలిటిక్స్‌తో ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని తెలిపారు. 22ఏ నిషేధితా జాబితాలో భూములు చిక్కుకుని జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మంత్రులు, కాంగ్రెస్ నేతలు భూదందా చేస్తున్నారని ఆరోపించారు.
డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్,పెండింగ్ బిల్లులు రాక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయక, కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వక లక్షలాది మంది విద్యార్ధులు అరిగోస పడుతున్నారని వాపోయారు. సాగు నీరందక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్‌పై ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపిన తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు రక్తం కారేలా కొట్టారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సభా సమయాన్ని వృథా చేయకుండా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కార మార్గాలు చూపాలని కోరారు.