ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం
- వాణిజ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం
- ఫౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
- ఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శితో మంత్రి సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను పెంచడంతోపాటు, వాణిజ్యాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఆ దేశ క్యాబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి. టు లారెల్ జూనియర్‌తో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భారతదేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా అవతరించిందని ఉత్తమ్ వివరించారు. భారీ పరిమాణంలో నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయగల ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ, అవసరమైన అనుభవం తెలంగాణకు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదనపై కార్యదర్శి లారెల్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ నుంచి మరింత పెద్ద పరిమాణంలో బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
సంబంధిత ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన దిగుమతిదారులు, ఎగుమతిదారులు, రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే విధానంపై చర్చించారు. ఫిలిప్పిన్స్‌కు దిగుమతి చేసుకునే బియ్యం అవసరం గణనీయంగా ఉండటం, అంతర్జాతీయంగా బియ్యం సరఫరా చేసే దేశాల సంఖ్యను విస్తరించేందుకు ఆ దేశం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ చర్చలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
పోటీ ధరలు, విశ్వసనీయమైన నాణ్యత, నిర్ణీత సమయంలో సరఫరా చేయగల సామర్థ్యంతో తెలంగాణ దీర్ఘకాలిక భాగస్వామిగా నిలవగలదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బియ్యం రకాలు, ధరలు, నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు విధానాలు, రవాణా, ధ్రువీకరణ ప్రక్రియలు, శానిటరీ, ఫైటోశానిటరీ నిబంధనలపై కూడా ఇరువురు చర్చించారు. ఈ అంశాలను సంబంధిత అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు పరిశీలించి, వాణిజ్య అవకాశాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. తెలంగాణ నుంచి మాంస ఉత్పత్తులు, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడంపైనా కార్యదర్శి లారెల్ ఆసక్తి వ్యక్తం చేశారు.
ఎగుమతికి అనువైన ఉత్పత్తులు, నాణ్యతా ప్రమాణాలు, అనుమతులు, ఇతర నియంత్రణ నిబంధనలను సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు రంగ ప్రతినిధులతో కలిసి పరిశీలిస్తామని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశాలు కల్పించడం వల్ల రైతులు, రైస్ మిల్లర్లు, విత్తన కంపెనీలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని ఇతర వర్గాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెప్పారు. తెలంగాణ రైతులు, వ్యవసాయ పరిశ్రమలకు స్థిరమైన, లాభదాయకమైన అంతర్జాతీయ మార్కెట్లను సృష్టించడమే మా లక్ష్యమన్నారు. భారత్ -ఫిలిప్పీన్స్ సంబంధాలు, ఆహార భద్రత, వ్యవసాయ సహకారం, తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు ప్రత్యక్ష వాణిజ్యాన్ని పెంచే అవకాశాలపై కూడా ఇరువురు విస్తృతంగా చర్చించారు.
డిసెంబరులో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ రావాల్సిందిగా కార్యదర్శి లారెల్‌కు ఉత్తమ్ ప్రత్యేక ఆహ్వానం అందించారు. వ్యవసాయం, బియ్యం, ఆహార ఉత్పత్తుల వాణిజ్యం, విత్తనాభివృద్ధి, అనుబంధ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరువురు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం, సంబంధిత ఫిలిప్పీన్స్ సంస్థలు, ప్రైవేటు రంగ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.