అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే

09-09-2026 | 05:25am
  1. సీఎం ఎవరనేది అధిష్టానానిదే నిర్ణయం  
  2. మంత్రుల శాఖల్లో మార్పుపై సీఎంను కోరాను 
  3. ఎమ్మెల్సీ వ్యాఖ్యలను కేసీఆర్ ఎందుకు ఖండించ లేదు 
  4. దళిత స్పీకర్‌ను అధ్యక్షా అనలేక సభకు రావడం లేదా?
  5. మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాల్సిందే
  6. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా త్వరలోనే ఫైనల్ 
  7. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్  

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్(PCC President Mahesh Kumar Goud) ధీమా వ్యక్తం చేశారు. బీసీని సీఎం చేస్తారా? అనే ప్రశ్నకు సీఎం ఎవరనేది అధిష్ఠానం చూసుకుంటుందని సమాధాన మిచ్చారు.

మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో పార్టీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయినందున మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలని అధిష్ఠానంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డికి సూచించినట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మహేశ్‌కుమార్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

తనకు మంత్రి పదవి అనేది పార్టీ నిర్ణయమని, తాను మాత్రం పీసీసీ అధ్యక్షపదవికే ప్రాధాన్యం ఇస్తానన్నారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే మా అందరి లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను తాను వినలేదని చెప్పారు. కాంగ్రెస్‌లో దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చామన్నారు.

దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అధ్యక్షా.. అని పిలవాల్సి వస్తుందనే కేసీఆర్ సభకు రావడం లేదని విమర్శించారు. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా ఉండలేదన్నారు. బీఆర్‌ఎస్ మాత్రం దళిత వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. భట్టి విక్రమార్కను ప్రధాన ప్రతిపక్ష హోదా నుంచి తొలగించారని గుర్తు చేశారు.

డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను బర్తరఫ్ చేయడం, కొప్పుల ఈశ్వర్‌ను మంత్రి కుర్చీ నుంచి పక్కకు పంపడం, దళితుడిని సీఎం చేస్తానని మోసం చేయడమే కాకుండా నేరేళ్లలో దళితులపై దాడులు చేయించారని విమర్శించారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి అంబేద్కర్ విగ్రహాలకు దండ వేయలేదని, ఇప్పుడు స్పీకర్‌పై బీఆర్‌ఎస్ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించడం లేదంటే.. వాళ్ల మనస్థతత్వం ఏంటో ఆర్థమవుతోందన్నారు. కేసీఆర్ కంటే సీఎం రేవంత్‌రెడ్డికి సామాజిక స్పృహ ఎక్కువన్నారు.

బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా సీరియస్‌గానే ఉన్నారని తెలిపారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల వడపోత జరుగుతుందని, రెండు, మూడు రోజుల్లో ఫైనల్ అవుతుందని మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఖమ్మం నల్లగొండ వరంగల్‌కు నాలుగు పేర్లు, హైదరాబాద్ రంగారెడ్డి  మహబూబ్‌నగర్ నియోజక వర్గానికి కూడా నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు. కొండా సురేఖను రెండోసారి ఇష్యును క్లోజ్ చేసుకోమని తాను చెప్పినట్లు ఆయన చెప్పారు. 22 ఏను సమూలంగా సమీక్షించి సమస్యను సవరించాలని సీఎం అనుకుంటున్నాడని ఆయన తెలిపారు. 


మరిన్ని వార్తలు