దేశ భవిష్యత్తును నిర్మించేది ఇంజినీర్లే
విజ్ఞాన్స్ యూనివర్సిటీ చాన్స్‌లర్ సుబ్బారావు
ఘనంగా ‘ఇంజినీర్స్ డే
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఇంజినీర్లు(Engineers) కేవలం సాంకేతిక పరిష్కారాలను అందించేవారు మాత్రమే కాకుండా, సమాజ పురోగతికి మార్గనిర్దేశకులని విజ్ఞాన్స్ యూనివర్సిటీ(Vignan University) చాన్స్‌లర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో మంగళవారం భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్ డే ఘనంగా నిర్వహించారు.
చాన్స్‌లర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం మార్కుల కోసమే కష్టపడి చదవకుండా, ఇష్టంతో ప్రయోగాలు చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. అప్పుడే సమాజంలోని నానాటికీ పెరుగుతున్న సమస్యలకు ఇంజినీరింగ్ ద్వారా శాశ్వత పరిష్కారాలు కనుగొనవచ్చని, దేశాన్ని అభివృద్ధితో ముందుకు నడపవచ్చని ఉద్బోధించారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, రవాణా, వ్యవసాయం, తయారీ రంగం.. ఇలా ప్రతీ విభాగంలోనూ ఇంజినీర్ల పాత్రే అత్యంత కీలకమని పేర్కొన్నారు. వర్సిటీలో ప్రాజెక్ట్ ఎక్స్‌పో, సాంకేతిక పోటీలను నిర్వహించారు.
విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల వినూత్న ప్రాజెక్ట్ ఎక్స్పోలు ఆకట్టుకున్నాయి. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఇంజినీర్స్ డే పురస్కరించుకుని, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో స్మైల్‌గార్డ్’ సంస్థ సౌజన్యంతో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యులను, హెచ్‌ఆర్ ప్రతినిధులైన కల్యాణి ముత్యాల, గీతలతో కూడిన బృందాన్ని వర్సిటీ డైరెక్టర్ సత్కరించారు. వేడుకల్లో విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, వర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు పాల్గొన్నారు.