అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, నవంబర్ 22 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితానే పునాది. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, అనర్హమైన, ద్వంద్వ నమోదులను నిబంధనల ప్రకారం గుర్తించి పారదర్శకమైన, విశ్వసనీయమైన ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి(Chief Electoral Officer C. Sudarshan Reddy) ఆదేశాలకు అనుగుణంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ నోటీసుల పంపిణీ, ఓటర్ల వివరాల ధ్రువీకరణ, అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది.
అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడటం, వివరాల్లో వ్యత్యాసాలున్న వారి నుంచి తగిన ఆధారాలు సేకరించడం, ప్రతి ఓటరుకు తన అర్హతను నిరూపించుకునే అవకాశం కల్పించడం ఈ ప్రక్రియలో ప్రధాన ఉద్దేశం. ఈ దిశగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు.
1.92 లక్షలకు పైగా నోటీసుల జనరేషన్.. 99.98 శాతం పంపిణీ....
జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 806 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి నవంబర్ 12వ తేదీ ఉదయం 10 గంటల నాటికి మొత్తం 1,92,963 నోటీసులు జనరేట్ అయ్యాయి. వీటిలో 99.98 శాతం నోటీసుల పంపిణీ పూర్తికాగా, కేవలం 37 నోటీసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలో నమోదైంది.
కోరుట్ల నియోజకవర్గ పరిధిలో 268 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 69,142 నోటీసులు, జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 265 పోలింగ్ స్టేషన్లకు 71,081 నోటీసులు, ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గ పరిధిలో 273 పోలింగ్ స్టేషన్లకు 52,740 నోటీసులు జనరేట్ అయ్యాయి.
కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో నోటీసుల పంపిణీ 100 శాతం పూర్తికాగా, జగిత్యాల నియోజకవర్గంలో 99.95 శాతం పంపిణీ నమోదైంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో మిగిలిన నోటీసుల పంపిణీని కూడా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
నో మ్యాపింగ్, అనామలీ నమోదులపై ప్రత్యేక పరిశీలన.....
ఓటరు వివరాల ధ్రువీకరణలో భాగంగా జిల్లాలో 40,683 నో మ్యాపింగ్ నమోదులు, 1,52,279 అనామలీ నమోదులు గుర్తించారు. వీటికి సంబంధించి ప్రతి ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు తమ వివరాలు, అర్హతలను నిరూపించుకునేందుకు తగిన అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు తావులేకుండా, సంబంధిత పత్రాలు, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఏ ఎస్ డి డి జాబితాలో 74,738 మంది ఓటర్లు....
ఓటరు జాబితా సవరణలో భాగంగా గైర్హాజరు, నివాసం మార్చిన వారు, మరణించిన వారు, నకిలీ నమోదులుగా గుర్తించిన ఓటర్లతో కూడిన ఏ ఎస్ డి డి జాబితాపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. జగిత్యాల జిల్లాలో మొత్తం 74,738 మంది ఓటర్లు ఈ జాబితాలో నమోదయ్యారు. వీరిలో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున పట్టణ ప్రాంతాలపై మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు.
నివాసం మార్చుకోని ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంతో పాటు అనెక్సర్ 'బి'ను, రాష్ట్రంలోనే మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్న ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంతో పాటు అనెక్సర్ '' ను సమర్పించాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చేందుకు ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ ఎస్ డి డి జాబితాలో ఉన్నవారు సూచించిన పత్రాలను సమర్పించి తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఇది చివరి అవకాశంగా భావించి స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంటింటికీ వెళ్లి నోటీసులు, పత్రాల సేకరణ....
సర్ ప్రక్రియలో భాగంగా బి ఎల్ ఓ లు ఓటర్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను వారి నివాసాల వద్దే సేకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. సాధారణంగా నోటీసులు అందుకున్న ఓటర్లను ఈ ఆర్ ఓ / ఏ ఈ ఆర్ ఓ కార్యాలయాలకు విచారణ కోసం పిలవాల్సిన అవసరం లేదని, సేకరించిన పత్రాలను ఈ సి ఐ నెట్ లో అప్లోడ్ చేసి సంబంధిత అధికారుల పరిశీలనకు పంపించాలని సూచించారు.
అవసరమైన పత్రాలు అందుబాటులో లేని సందర్భాల్లోనూ వాస్తవంగా అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా స్థానికంగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఓటరు అర్హుడు కాదని నిర్ధారణ అయిన సందర్భాల్లో మాత్రమే తగిన కారణాలు, ఆధారాలతో ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
వృద్ధులు, దివ్యాంగులు, నిరాశ్రయులు, రోజువారీ కూలీలు, కార్మికులకు ప్రత్యేక సహకారం అందించాలని, అవసరమైన ప్రాంతాల్లో హెల్ప్‌డెస్క్‌లు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.
ఎన్నికల సంఘం వరుస సమీక్షలు.. మార్గదర్శకాల అమలు....
సర్ - 2026 అమలుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 21, అక్టోబర్ 1, అక్టోబర్ 17 తేదీల్లో జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి పురోగతిని సమీక్షించారు. నోటీసుల జనరేషన్, పంపిణీ, నో మ్యాపింగ్, అనామలీ నమోదుల విచారణ, ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఐదు రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని, ప్రతి బి ఎల్ ఓ తమ పరిధిలోని ఓటర్ల వివరాలు, నోటీసుల పంపిణీ, పత్రాల స్వీకరణ, విచారణ స్థితిని డిజిటల్‌తో పాటు భౌతిక రికార్డుల్లోనూ నమోదు చేయాలని సూచించారు. ఈ ఆర్ ఓ కార్యాలయాల్లో నోటీసుల పరిష్కార స్థితి, క్లెయిమ్స్, అభ్యంతరాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు.
ఫారం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు, ఫారం-7 ద్వారా అభ్యంతరాలు లేదా తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులు, ఫారం-8 ద్వారా ఓటరు వివరాల సవరణలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని తెలిపారు. ముఖ్యంగా ఓటరు పేరు తొలగింపు విషయంలో సంబంధిత వ్యక్తికి నోటీసు అందించి, తన వాదన వినిపించుకునే అవకాశం కల్పించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ....
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కార్యాలయ సమీక్షలతో పాటు క్షేత్రస్థాయిలోనూ సర్ పనులను జిల్లా లోని అన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ, తక్కళ్లపల్లి, నర్సింగాపూర్ గ్రామాలతో పాటు కోరుట్ల, ధర్మపురి ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల ధ్రువీకరణ, నోటీసుల పంపిణీ, పత్రాల సేకరణపై బి ఎల్ ఓ లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
జిల్లాను అభినందించిన ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి. బాలమాయాదేవి...
అక్టోబర్ 6న నర్సింగాపూర్ గ్రామంలో ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి. బాలమాయాదేవితో కలిసి హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించి, ఓటర్లకు అందిస్తున్న సేవలు, ఫారాల స్వీకరణ, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించారు. అనంతరం ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓ లతో నిర్వహించిన సమావేశంలో పనుల పురోగతిని పరిశీలించి, మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల వివరాల రీకన్సిలియేషన్, డాక్యుమెంటేషన్‌ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ప్రతి ఓటరు హక్కు పరిరక్షణే ప్రధాన లక్ష్యం....
అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, ఓటరు జాబితాలోని తప్పులు, ద్వంద్వ నమోదులను నిబంధనల ప్రకారం సరిచేయడం ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అర్హులైన యువత ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, చిరునామా లేదా ఇతర వివరాల్లో మార్పులు అవసరమైన వారు ఫారం-8 ద్వారా సవరణలు కోరవచ్చని తెలిపారు. ఓటరు జాబితాలోని నమోదులపై అభ్యంతరాలు ఉన్నవారు ఫారం-7 ద్వారా తెలియజేయవచ్చని సూచించారు.
ఎన్నికల సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఓటర్లు అవసరమైన వివరాలు అందించి సహకరించాలని, నోటీసులు అందినవారు వాటిని నిర్లక్ష్యం చేయకుండా సూచించిన పత్రాలను బి ఎల్ ఓ లకు సమర్పించాలని కోరారు. ఏ ఎస్ డి డి జాబితాలో ఉన్నవారు ఎన్యూమరేషన్ ఫారంతో పాటు తమకు వర్తించే అనెక్సర్‌ను సమర్పించి ఓటరు జాబితాలో తమ పేరును నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, 15 మండలాల పరిధిలో ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓ లు, తహసీల్దార్లు, బి ఎల్ ఓ లు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా, ప్రతి నమోదును పారదర్శకంగా పరిశీలించి విశ్వసనీయమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం బాధ్యతతో కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు ఉండేలా ధ్రువీకరించుకోవాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులకు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.