గాంధీభవన్‌లో నేడు కాంగ్రెస్ కీలక భేటీలు
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కీలక సమావేశాలు (Key Meetings) జరగనున్నాయి. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీతో పాటు విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాలకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే సమావేశాల అజెండా (Agenda) ఖరారైంది. కొత్తగా ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌గా నియమితులైన బీఎం సందీప్ కుమార్‌కు స్వాగతం పలుకుతూ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. గతంలో ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహించి పార్టీకి సేవలందించిన మీనాక్షి నటరాజన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానాన్ని ఆమోదించనున్నారు.
రాష్ట్రంలో మూడేళ్లుగా కొనసాగుతున్న ప్రజాపాలన, ఈ కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సమగ్రంగా చర్చించనున్నారు. తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, తదుపరి కార్యాచరణపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే 'సంఘటన్ సృజన్ అభియాన్'లో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే అంశంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. పార్టీ బలోపేతం (Party Strengthening), ఇతర రాజకీయ, సంస్థాగత అంశాలపై కూడా టీపీసీసీ అధ్యక్షుడి అనుమతితో చర్చించనున్నట్లు సమావేశాల అజెండాలో తెలిపారు.