నవంబర్ 30న జిల్లాలో గవర్నర్ పర్యటన
నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల, నవంబర్ 25 (విజయక్రాంతి): ఈ నెల 30న సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా(Governor Shiva Pratap Shukla) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ 30 సోమవారం నాడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాలో పర్యటించి కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారని, అనంతరం కొండగట్టులోని జేఎన్టీయూలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. గవర్నర్ నవంబర్ 30న ఉదయం హెలిప్యాడ్‌కు చేరుకోనున్న నేపథ్యంలో అక్కడ అవసరమైన బ్యారికేడింగ్, ఇతర మౌలిక ఏర్పాట్లను ఆర్ అండ్ బీ అధికారులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
హెలిప్యాడ్ వద్ద అనుమతి పొందిన వ్యక్తులు మాత్రమే గవర్నర్‌కు స్వాగతం పలికేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి గవర్నర్ నేరుగా అతిథిగృహానికి చేరుకుంటారని, అక్కడ పోలీసు శాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనం సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ గీతం, రాష్ట్ర గేయం ఆడియో ప్రదర్శనలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులను ఆదేశించారు.
అతిథిగృహం నుంచి గవర్నర్ నేరుగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటారని, అక్కడ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలకాలని తెలిపారు. గవర్నర్ స్వామివారి దర్శనం, అభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జేఎన్టీయూ కొండగట్టు అడ్మిన్ బ్లాక్ సమీపంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసు శాఖ సహకారంతో జిల్లా సంక్షేమ అధికారి ర్యాలీకి అవసరమైన జన సమీకరణ, ఇతర ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
జేఎన్టీయూ కొండగట్టు అడ్మిన్ బ్లాక్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ స్టాళ్లను గవర్నర్ సందర్శించి మహిళా సంఘాల కార్యకలాపాలు, వారి ద్వారా చేపడుతున్న జీవనోపాధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివిధ శాఖల అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.
గవర్నర్ తుది పర్యటన షెడ్యూల్ త్వరలోనే అందజేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు చేపడుతున్న చర్యలు, నిక్షయ్ మిత్ర కార్యక్రమం, టీబీ బాధితులకు అందిస్తున్న పౌష్టికాహార సహాయం, ఇప్పటివరకు సాధించిన ప్రగతి వివరాలను సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, తాగునీటి లభ్యత, సాగునీటి భద్రత, పంటల రక్షణ, పశుగ్రాసం అందుబాటు వంటి అంశాలపై సంబంధిత శాఖలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.
వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమాలు, రక్తనిధి సేవలు, తలసేమియా బాధితులకు అందిస్తున్న సహాయం, సభ్యత్వ నమోదు, ఇతర మానవతా సేవా కార్యక్రమాల వివరాలను సిద్ధం చేయాలని సూచించారు. 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి చేపడుతున్న శాశ్వత, తాత్కాలిక పనుల పురోగతి, మౌలిక వసతుల అభివృద్ధి, పుష్కరాల నిర్వహణకు చేపడుతున్న సన్నాహక చర్యలపై సంబంధిత శాఖలు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆరోగ్య, పోషకాహార కార్యక్రమాల్లో భాగంగా అనీమియా ముక్త్ భారత్, సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్, తల్లీబిడ్డల ఆరోగ్యం, పోషకాహార లోపం నివారణ, అంగన్వాడీ సేవల అమలు తీరును సమగ్రంగా వివరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
విద్యారంగంలో సాధించిన ప్రగతి, గురుకుల పాఠశాలల పనితీరు, నైపుణ్యాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, యువజన సంక్షేమ కార్యక్రమాల వివరాలను సిద్ధం చేయాలని విద్యాశాఖ, ఉపాధి కల్పన శాఖ అధికారులను ఆదేశించారు. మహిళా సాధికారతలో భాగంగా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు, లక్షాధికారి దీదీ కార్యక్రమం, మహిళలకు జీవనోపాధి కల్పన, మహిళా పారిశ్రామికవేత్తల విజయగాథలను, స్టాల్స్ సిద్ధం చేయాలని డీఆర్డీఏ, సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. గిరిజనులు, బలహీన వర్గాలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, వారికి అందిస్తున్న సేవల వివరాలను సిద్ధం చేయాలని అన్ని సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ రంగంలో ప్రకృతి వ్యవసాయం, చిరుధాన్యాల ప్రోత్సాహం, నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలని వ్యవసాయ, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులకు సూచించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పథకాల అమలు తీరు, భౌతిక, ఆర్థిక ప్రగతి, లబ్ధిదారుల వివరాలు, జిల్లాలో సాధించిన విజయాలు, ప్రత్యేక కార్యక్రమాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అన్ని శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.
జిల్లా అభివృద్ధి సూచికలు, వినూత్న కార్యక్రమాలు, ఉత్తమ విధానాలు, ప్రధాన విజయాలు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను సమగ్రంగా రూపొందించాలని అధికారులకు సూచించారు.
గవర్నర్ పర్యటనలో భాగంగా ప్రోటోకాల్, భద్రత, స్వాగత ఏర్పాట్లు, వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రదర్శనలు, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమాలు, ఇతర అవసరమైన ఏర్పాట్లను సంబంధిత అధికారులు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఆర్.డి.ఓ. మధుసూదన్, డి.ఎస్పీ. పురుషోత్తం రెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.