మత్తు పదార్థాలతో జీవితాలు చిన్నాభిన్నం
కలెక్టర్ చిత్రా మిశ్రా..
ముకరంపుర, నవంబర్ 25 (విజయక్రాంతి): డ్రగ్స్, గంజాయి తదితర మత్తుపదార్థాల వినియోగంతో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని.. వాటిని తయారు చేస్తున్న వారిపై, సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా(Collector Chitra Mishra) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీలో జిల్లాస్థాయి నార్కోటిక్స్ నియంత్రణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం, డీఆర్ఓ స్వామి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ దుష్పరిణామాలపై విద్యాసంస్థల్లో, ఊరూరా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. డ్రగ్స్ సరఫరా, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో నమోదవుతున్న గంజాయి కేసులు, మాదకద్రవ్యాల నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను శాఖల వారీగా తెలుసుకున్నారు. విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రగ్స్ కట్టడికి పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను, నమోదు చేసిన కేసుల వివరాలను సీపీ గౌస్ ఆలం వివరించారు.డ్రగ్స్ పర్యవసనాలపై విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తున్నట్లు డీసీపీఓ పర్వీన్ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ, నషా ముక్త్ భారత్ లో భాగంగా ప్రతి పాఠశాలలో ఒక టీచర్ను నియమించి.. డ్రగ్స్ కట్టడికి కృషి చేస్తున్నట్లు ఇన్చార్జి డీఈఓ తిరుపతిరావు పేర్కొన్నారు. ఇటీవల పట్టుబడిన గంజాయి కేసులను టాస్క్ ఫోర్స్ సీఐ దుర్గాభవాని వివరించారు.అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.