సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు.. అధికారులకు దిశానిర్దేశం

25-11-2026 | 08:19pm

* సభా ప్రాంగణం, హెలిప్యాడ్, భద్రత, పార్కింగ్ ఏర్పాట్ల పరిశీలించిన ఎస్పీ కలెక్టర్

* అచ్చంపేట సభలో సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ చీరల పంపిణీ

అచ్చంపేట, నవంబర్ 25 (విజయక్రాంతి): ఈ నెల 26న అచ్చంపేట నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలు, బహిరంగ సభా ప్రాంగణం, హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలు, పాదయాత్ర మార్గం, అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్(District Collector Hemanta Keshav Patil), జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, వనపర్తి ఎస్పీ సునీతారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ముఖ్యమంత్రి భద్రతా అధికారులతో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు. సభకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, పార్కింగ్ వంటి సౌకర్యాలను సమృద్ధిగా కల్పించాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.

అచ్చంపేట పట్టణంలోని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించి వేదిక నిర్మాణం, ప్రజలు కూర్చునే ప్రాంతం, ప్రవేశ ద్వారాలు, వీఐపీ ప్రదేశాలు, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. సభకు వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.

* హెలిప్యాడ్, అంబేద్కర్ కూడలి పరిశీలన

లింగాల రోడ్డులోని ఆర్టీసీ మైదానంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. హెలికాప్టర్ ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో భద్రతా చర్యలు, పరిసరాల పరిశుభ్రత, హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ వెళ్లే మార్గంపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కాన్వాయ్ చేరుకునే అంబేద్కర్ కూడలిని పరిశీలించి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించే కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై సమీక్షించారు.

* సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ చీరల పంపిణీ

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో మహిళలకు ఇందిరమ్మ చీరలను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తొలుత ఎమ్మెల్యే చేతుల మీదుగా చేపట్టాలని భావించిన పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన అచ్చంపేటకు ఎంతో ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని, అధికారులు ప్రజలతో మమేకమై పనిచేస్తూ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని కోరారు. మహిళలు, వృద్ధులు, యువత, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

* సమన్వయంతో పనిచేయాలి : ప్రభుత్వ విప్

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి, ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పర్యటన మార్గంలో పోలీసు సిబ్బందిని మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ దేవసహాయం, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు