పట్టణ అభివృద్ధికి కౌన్సిల్ ప్రాధాన్యత
మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల, నవంబర్ 28 ( విజయక్రాంతి ) : జగిత్యాల పురపాలక సంఘ కార్యాలయంలో(Jagtial Municipal Office) మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్(Samindla Vani Srinivas) అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పట్టణ అభివృద్ధి(Urban Development), ప్రజా సౌకర్యాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
సమావేశం ప్రారంభంలో జగిత్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ యూసఫ్ అజాద్ ఇటీవల మరణించిన సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ కౌన్సిల్ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా మెరుగుదల, వార్డు కార్యాలయాల మరమ్మతులు, ఆర్సీసీ స్లాబ్‌లు, కల్వర్టుల నిర్మాణం, ఓపెన్ జిమ్‌ల నిర్వహణ, ఓపెన్ వెల్ల రక్షణ, నీటి సరఫరా లీకేజీల నివారణ, అవసరమైన సామగ్రి కొనుగోలుకు నిధులు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. అలాగే మున్సిపల్ వాహనాల మరమ్మతులు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీనివాస ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అవసరమైన ఏర్పాట్లకు కూడా కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
వాహనాల మరమ్మతులకు సంబంధించి పారిశుద్ధ్య విభాగం ద్వారా పనులు చేపట్టడంతో పాటు, ఈ పనుల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. డీజిల్ నిర్వహణ అంశంపై సభ్యులు కోరిన వివరణలకు సంబంధిత అధికారులు సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రివిజన్ అసెస్మెంట్ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ, ఈ విషయంపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తైబజార్ అంశంపై సమావేశంలో చర్చించి, పూర్తి వివరాలతో తదుపరి కౌన్సిల్ సమావేశంలో మరోసారి చర్చించాలని నిర్ణయించారు.
పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాలు కల్పిస్తూ వార్డుల వారీగా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తుందని చైర్పర్సన్ తెలిపారు. అలాగే సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో వైస్ చైర్పర్సన్ జీనత్ పర్వీన్ మునీరుద్దీన్, మున్సిపల్ కమిషనర్ కె. సత్యప్రణవ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, డి.ఈ. అరుణ్, టి.పి.ఓ. శ్రీనివాస్, మేనేజర్ సుష్మా, జే.ఏ.ఓ. గణేష్, మున్సిపల్ ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్, ఎన్పీడీసీఎల్ ఏ.ఈ.లు, ఐ.సి.డి.ఎస్ అధికారులు, ట్రాఫిక్ ఎస్.ఐ. మల్లేష్, మున్సిపల్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.