వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన రెస్క్యూ టీం
ములకలపల్లి,నవంబర్ 04, (విజయక్రాంతి): మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలకు వాగులు,వంకలు ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్నాయి. బుధవారం ములకలపల్లి(Mulakalapalli) మండల వ్యాప్తంగా కుండపోత వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మధ్యతరహా మూకమామిడి సాగునీటి ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అలుగుపారుతోంది. వాగులో చిక్కుకున్న మూకమామిడి గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తిని రెస్క్యూ టీం సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
మూకమామిడి - మొగరలగుప్ప గ్రామాల మధ్య ఉన్న వాగులో వంతెన పూర్తిగా తెగిపోవడంతో గ్రామస్తులకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.ఎటు నుంచి ఏ మార్గం లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.చెరువులు అలుగు పారడంతో రోడ్లు కోతకు గురై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీరు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది.మూకమామిడి పంచాయతీ పరిధిలో చెరువు పొంగి పొర్లడంతో వరద నీరు ఇళ్లలోకి చేరి పలు ఇళ్లు ముంపునకు గురయ్యాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని,వాగులు,వంకల వైపు ఎవరూ వెళ్లకూడదని సూచించారు.అత్యవసరమైతే పంచాయతీ సిబ్బందికి తెలియపరచాలని,పంచాయతీలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన రిస్క్యూ టీం,సమాచారం అందించిన వెంటనే సహకరించిన స్థానిక ఎస్సై మధు ప్రసాదుకు,ఎమ్మార్వో స్వాతి బిందు,అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.