చెరువుల పరిరక్షణ అభివృద్ధి పనులు చేపట్టాలి

13-11-2026 | 02:47pm

జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్

జగిత్యాల, నవంబర్ 13 ( విజయ క్రాంతి ): జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో(Chintakunta Lake) మురుగునీరు కలవకుండా శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, చెరువు పరిరక్షణ, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం అమృత్ 2.0 పథకం(AMRUT 2.0 Scheme) కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, మున్సిపల్(MLA Dr. Sanjay Kumar) చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ తో కలిసి చింతకుంట చెరువు, గ్రేవ్‌యార్డ్, పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ చెరువుల పరిరక్షణకు ముఖ్యమంత్రి చొరవతో అమృత్ 2.0 పథకం కింద జగిత్యాల పట్టణంలోని మోతె చెరువు, చింతకుంట చెరువు, రాయికల్ పెద్ద చెరువు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, చెరువుల సహజ స్వరూపాన్ని కాపాడుతూ భావితరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో మున్సిపాలిటీలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న సీనియర్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు పట్టణ అభివృద్ధి, చెరువుల పరిరక్షణపై తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించారు.

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీలపై నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల బఫర్ జోన్ పరిధిలో ఇళ్లు, వ్యాపారాలు ఏర్పడ్డాయని, వీటి ప్రభావంతో నేడు చెరువులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని అన్నారు. గతంలో జరిగిన అక్రమ నిర్మాణాలపై సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. హైడ్రా తరహాలో జగిత్యాలలో కూడా చెరువులు, నాలాలు,

ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని గతంలో ఆ పెద్దమనిషి సూచించారని గుర్తుచేస్తూ, చెరువుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, లే అవుట్ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టేలా చూడాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు.

గతంలో నగరబాట కార్యక్రమం కింద నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ, అవి ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా లేవని అన్నారు. ఎల్.ఎల్. గార్డెన్స్ నుంచి ధన్వంతరి ఆలయం వరకు 21 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించగా, కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నానా యాగీ చేసి పనులను నిలిపివేశారని, తద్వారా పట్టణ అభివృద్ధికి ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించడం కాకుండా, పట్టణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 67 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా 33 శాతం ఉందని, అయితే జీఎస్టీ రూపంలో 18 శాతం తిరిగి కేంద్రానికి వెళ్తుందని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వ వైఖరి విత్తు వేసి పొత్తు కలిసినట్లు ఉందని వ్యాఖ్యానించారు. చింతకుంట చెరువు కేవలం చుట్టుపక్కల వార్డుల ప్రజలకే పరిమితమైనది కాదు.. యావత్ జగిత్యాల పట్టణ ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన నీటి వనరు, ఆహ్లాదకరమైన ప్రదేశం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇప్పటికే చింతకుంట చెరువు మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చెంది, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పార్కులు, వినాయక నిమజ్జనం, బతుకమ్మ వేడుకలకు సంబంధించిన సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే చెరువులోకి మురుగునీరు చేరడం ప్రధాన సమస్యగా ఉందని, మురుగునీరు చెరువులో కలవకుండా శాశ్వత పరిష్కారం చూపేలా అమృత్ 2.0 పథకం కింద సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.

మురుగునీటిని చెరువులోకి చేరకుండా మళ్లించడం, నీటి కాలుష్యాన్ని నివారించడం, చెరువు నీటి నాణ్యతను కాపాడటం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ పనులు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిరక్షిస్తూ, చెరువును మరింత పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.

చెరువుల పరిరక్షణ అనేది కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదని, భూగర్భ జలాల పెంపునకు, పర్యావరణ సమతుల్యతకు, గంగపుత్రుల జీవనోపాధికి ఎంతో కీలకమని అన్నారు. చెరువుల అభివృద్ధి వల్ల పట్టణ ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుతుందని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. చెరువుల పరిరక్షణలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని, భావితరాలకు సురక్షితమైన నీటి వనరులను అందించడం మనందరి బాధ్యతని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, ఈఈ ఖాన్, డీఈ వరుణ్, ఎమ్మార్వో రామ్మోహన్, టీపీఓ శ్రీనివాస్, కౌన్సిలర్లు బొల్లారపు స్వప్న, కౌన్సిలర్లు, పట్టణ ముఖ్య నాయకులు, వార్డు నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు