దొడ్డి కొమురయ్య వారసులను ఆదుకోవాలి

12-11-2026 | 04:40pm

జనగామ,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వారసుల(Doddi Komuraiah Family)ను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం(Sheep and Goat Farmers Association) జనగామ జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్, ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు డిమాండ్ చేశారు.

గానుగుపాడు గ్రామంలో నిర్వహించిన సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య వారసుడు దొడ్డి బిక్షపతి చెట్టుపై నుంచి పడి నడుము విరగడంతో మంచానికే పరిమితమయ్యాడని తెలిపారు. ఆయన భార్య అనసూయ మూర్ఛ వ్యాధితో బాధపడుతుండగా, కుమారుడు చంద్రం అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

చరిత్రలో నిలిచిన తెలంగాణ తొలి అమరుడి కుటుంబం నేడు ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుండటం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, హైదరాబాద్‌లో ఇంటి స్థలం కేటాయించడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అలాగే కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సాదం రమేష్, ఉపాధ్యక్షుడు గుండా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు