కాలనీవాసుల ఫిర్యాదుతో కదిలిన హైడ్రా
ప్రశాంత్ నగర్లో 2,121 గజాల ప్రభుత్వ స్థలానికి హైడ్రా కంచె
ఘట్కేసర్, నవంబర్ 13 (విజయక్రాంతి) : ప్రభుత్వ స్థలాల(Government lands) పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా అధికారులు(HYDRA officials) చర్యలు చేపడుతున్నారు. ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ ప్రశాంత్ నగర్ కాలనీలో ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉన్న ప్రభుత్వ స్థలాలకు రక్షణ కల్పించారు.
కాలనీవాసుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వే నంబర్లు 94, 95లో ఉన్న మొత్తం 2,121 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి శుక్రవారం ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో పాఠశాల నిర్మాణానికి 868 గజాలు, పార్కు కోసం 765 గజాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 488 గజాలు కేటాయించినట్లు అధికారులు గుర్తించారు.
భవిష్యత్తులో ఈ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలకు రక్షణ కల్పించడంపై ప్రశాంత్ నగర్ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు గంట సోమిరెడ్డి, కోశాధికారి బీనబోయిన శ్రీనివాస్‌తో పాటు పలువురు కాలనీవాసులు హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు హైడ్రా తీసుకున్న చర్యలు అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.