పోరాటంతో సాధించిన జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీ
టీజీవిపీ జిల్లా కార్యదర్శి తుంగ కౌశిక్
జనగామ, నవంబర్ 29 (విజయక్రాంతి): జనగామ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు ఏ ఒక్క ప్రభుత్వం ఇచ్చిన కానుక కాదని, అది విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, జనగామ ప్రజలు చేసిన నిరంతర పోరాటాల ఫలితమేనని టీజీవిపీ జిల్లా కార్యదర్శి తుంగ కౌశిక్(TGVP District Secretary Tunga Kaushik) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018 నవంబర్ 23న ఎన్నికల ప్రచారంలో జనగామకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, జనగామలో తప్పనిసరిగా ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
అయితే హామీ అమలులో జాప్యం జరగడంతో విద్యార్థి సంఘాలు పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయని తెలిపారు. 2022 ఫిబ్రవరిలో జరిగిన బహిరంగ సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఆ హామీ కూడా అమలుకు నోచుకోకపోవడంతో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేశాయని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన (తెరాస) పార్టీ కోఆర్డినేటర్ ఆసర్ల సుభాష్, బీసీ సంఘం నాయకులు బోడ రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.