శిథిలమవుతున్న రోడ్డు
- ఎక్కువ బరువు గల వాహనాలు తిరగడంతోనే
- ఎక్కువ బరువు వాహనాలను నిరోధించాలి
- రోడ్డు శిథిలం అవుతుందని
- ప్రజల ఆందోళన
తాడ్వాయి,నవంబర్, 29( విజయక్రాంతి ): ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు(Travel facilities) కల్పించానే సంకల్పంతో ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి రోడ్డు నిర్మాణాలు(Road construction) చేపడితే,కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పనులతో రోడ్లు శిథిలమవుతున్నాయి. నిర్మించిన అనతి కాలంలోనే రోడ్లకు గుంతలు ఏర్పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం దేవాయిపల్లి, బ్రాహ్మణపల్లి రోడ్డును నిర్మించిన అనతి కాలంలోనే శిథిలం అయింది.ఈ రోడ్డును అప్పటి ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టితో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో నిధులు మంజూరు చేయించి పూర్తి చేశారు.దేవాయిపల్లి నుంచి కాళోజి వాడి గ్రామ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు.
మండల కేంద్రానికి సులభ మార్గం కోసం
తాడ్వాయి మండల కేంద్రానికి సులభంగా రెండు గ్రామాల ప్రజలు చేరుకోవడానికి ఈ రోడ్డు మార్గం బాగుంటుందనే లక్ష్యంతో రోడ్డును నిర్మించారు. మండలంలోని బ్రాహ్మణపల్లి, కాళోజివాడి గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు మార్గం ద్వారా దూరం తగ్గించడానికి ఉపయోగపడుతుందని భావించారు. మండల కేంద్రానికి చేరుకోవడమే కాకుండా తాడ్వాయి మండలంలోని గ్రామాల ప్రజలు సదాశివ నగర్ మండలానికి, నిజామాబాద్ వైపు వెళ్లే ప్రజలకు ఈ రోడ్డు సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు భావించారు. అందుకోసం లక్షల రూపాయలు వెచ్చించి రోడ్డు నిర్మాణం చేపట్టారు.
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విచ్చలవిడిగా రోడ్డుపై తిరగడంతో రోడ్డు శిథిలమవుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాయిపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య ఏర్పాటుచేసిన గోదాముల కారణంగానే రోడ్డు శిథిలమవుతుందని స్థానికులు వాపోతున్నారు.ఎక్కువ బరువు సామర్ధ్యం గల వాహనాలు తిరగడంతోనే రోడ్డుకు గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బారీ వాహనాలను అరికట్టాలని కోరుతున్నారు,లేదా వాహనాలకు ప్రత్యేక రుసుము వసూలు చేసి రోడ్డును బాగు చేయించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అడుగడుగునా గుంతలు
రోడ్డుపై అడగడుగున గుంతలు ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దూర భారం తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ రోడ్డు మార్గంపై వెళ్లిన ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్డు శిథిలం కావడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలు గుర్తించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు నిర్వహించాలని కోరుతున్నారు గోదాములకు ధాన్యాన్ని తీసుకురావడానికి, గోదాము నుంచి ధాన్యాన్ని తరలించడానికి భారీ లారీలను ఉపయోగిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భారీ సామర్థ్యం గల లారీలను నిరోధించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.