డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం కావాలి
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
గణపురం,అక్టోబర్ 07 (విజయక్రాంతి):డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం కావాలని మత్తు పదార్థాల నియంత్రణతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyannarayana Rao ) అన్నారు. బుధవారం గణపురం మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో మత్తు పదార్థాల వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా విద్య, క్రీడలు, సామాజిక సేవలపై దృష్టి సారించాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల వ్యక్తి ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాల నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
అనంతరం విద్యార్థులు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులతోపాటు గణపురం ఎస్ఐ బొరగల అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరి శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటె మియా, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.