రోడ్డు ప్రమాదం.. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది

07-10-2026 | 05:37pm
  1. భార్యాభర్తలు, కుమారుడు మృతి.. ఆస్పత్రిలో కుమార్తె
  2. మేడిపల్లిలో విషాదఛాయలు.. ఒకేసారి ముగ్గురి అంత్యక్రియలు

మొయినాబాద్‌, అక్టోబరు 7(విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదం(Road accident) ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో భార్యాభర్తలు, వారి కుమారుడు మృతిచెందగా.. కుమార్తె తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం మేడిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మధు (35), భార్య సావిత్రి (31), కుమారుడు ధనుష్‌ (6), కుమార్తె అక్షిత (8) మంగళవారం మధ్యాహ్నం చేవెళ్ల మండలం చన్వెల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి విందుకు వెళ్లారు. అనంతరం రాత్రి మధు భార్యాపిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు.

చేవెళ్ల మండలం గొల్లపల్లి గేట్‌ వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధు, సావిత్రి, ధనుష్‌ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన అక్షితను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కంటతడి పెట్టించిన అంత్యక్రియలు

బుధవారం మేడిపల్లి గ్రామంలో ముగ్గురి అంత్యక్రియలు నిర్వహించారు. ఒకరి వెంట ఒకటిగా భార్యాభర్తల పాడెలను తీసుకెళ్లడం, చిన్నారి ధనుష్‌ మృతదేహాన్ని చేతులపై మోసుకెళ్లిన దృశ్యాలు గ్రామస్థులను కలచివేశాయి. కుటుంబ సభ్యుల రోదనలు, బంధువుల కన్నీటితో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు