చెత్త వేయొద్దంటే ప్రత్యామ్నాయం ఏదీ?
ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం
చెత్త కుండీ తీసేసారు.. చెత్త వేస్తూనే ఉన్నారు
పర్యవేక్షణ కరువు
ఇబ్బంది పడుతూ ప్రజలు
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): చెత్త కుండీని తొలగించినా.. అదే ప్రాంతంలో చెత్త వేయడం కొనసాగుతుండటంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేటీకె 6వ గనికి వెళ్లే మార్గంలో యాదవకాలనీ సమీపంలో ఈ పరిస్థితి నెలకొంది.
గతంలో చెత్త వేసేందుకు ఏర్పాటు చేసిన కుండీని తొలగించినప్పటికీ, కొందరు ప్రజలు అదే ప్రాంతంలో చెత్తను పడేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడ చెత్త పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోంది. చెత్త కారణంగా కుక్కలు, పందులు అక్కడ సంచరిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం?
చెత్త కుండీని తొలగించిన తర్వాత ప్రజలు ఎక్కడ చెత్త వేయాలి, స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ ఎలా జరుగుతుందనే విషయాలపై తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం మరింత మెరుగుపడాలని కోరుతున్నారు.
చెత్త పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య సమస్య తలెత్తుతోందని, దోమలు, ఇతర కీటకాలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే ప్రత్యామ్నాయ చెత్త సేకరణ ఏర్పాట్లు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.