ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తుల కానుకల వెల్లువ..
ఏడు నెలలకు రూ.8.15 లక్షల హుండీ ఆదాయం
శివంపేట నవంబర్ 6 (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak district) శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామపంచాయతీ పరిధిలోని చాకిరిమెట్ల స్వయంభూ శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. గత ఏడు నెలలుగా భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో లెక్కించగా మొత్తం రూ.8,15,516 ఆదాయం వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
సహకార ఆంజనేయ స్వామి దేవస్థానానికి నిత్యం పరిసర గ్రామాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు తమ భక్తిశ్రద్ధలతో హుండీలో సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి గణనీయమైన ఆదాయం సమకూరింది. ఏడు నెలల కాలానికి రూ.8 లక్షలకు పైగా హుండీ ఆదాయం రావడం పట్ల ఆలయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకులు, దేవస్థాన ఫౌండర్ ట్రస్టీ ఆంజనేయ శర్మ, కార్యనిర్వహణాధికారి సార శ్రీనివాస్, సింగాయిపల్లి నారాయణరావు, శ్రీ లలిత సేవ సంస్థ సేవకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.