సాగు సమస్యలపై రైతులతో ముఖాముఖి..
విద్యార్థినులకు క్షేత్రస్థాయి అవగాహన
శివ్వంపేట నవంబర్ 6 (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) శివ్వంపేట మండల కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) తునికి శాస్త్రవేత్త డాక్టర్ ఎం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్పంచ్, రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో అగ్రికల్చర్ నాలుగో సంవత్సరం చదువుతున్న 17 మంది విద్యార్థినులు తమ విద్యలో భాగంగా చేపట్టిన రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ.. వ్యవసాయ విద్యార్థినులు గత నాలుగు నెలలుగా శివ్వంపేట గ్రామంలోనే ఉంటూ గ్రామీణ వ్యవసాయ పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. గ్రామంలోని రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలు, సాగు విధానాలు, చీడపీడల సమస్యలు, వాటి నివారణకు అనుసరిస్తున్న యాజమాన్య పద్ధతులను పరిశీలిస్తూ అవగాహన పొందుతున్నారని వివరించారు.
అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల దిగుబడి పెంపునకు అనుసరించాల్సిన మెళకువలు, రైతుల అనుభవాలను నేరుగా తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. పుస్తకాల్లో నేర్చుకున్న వ్యవసాయ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా విద్యార్థినులకు ఆచరణాత్మక అనుభవం లభిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్‌తో పాటు రైతులు నర్సింలు, లక్ష్మీ నరసయ్య, శ్రీనివాస్, నారాయణ తమ వ్యవసాయ అనుభవాలను విద్యార్థినులతో పంచుకున్నారు. సాగులో ఎదురవుతున్న సమస్యలు, పంటల యాజమాన్య పద్ధతులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కేవీకే తునికి ఉద్యాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్, సర్పంచ్ వెంకటేష్, రైతులు, 17 మంది వ్యవసాయ విద్యార్థినులు పాల్గొన్నారు.