తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే జారె పర్యటన
దెబ్బతిన్న రహదారులు పంట పొలాల పరిశీలన
రోడ్డు మార్గం దెబ్బతిన్న గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
నెమలిపేట గ్రామానికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కల్పిస్తా: ఎమ్మెల్యే జారే
దమ్మపేట, నవంబర్ 06 (విజయక్రాంతి): దమ్మపేట మండలంలో మురసు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దమ్మపేట, నెమలిపేట, పార్కలగండి, కొత్తూరు, పట్వారిగూడెం, దిబ్బగూడెం, జగ్గారం, అంకంపాలెం గ్రామాల్లో తుఫాను కారణంగా తెగిపోయిన రహదారులు, చెరువులు, వాగులను పరిశీలించడంతో పాటు వరద నీటితో దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు.
రహదారులు ధ్వంసం అయిన గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణమే డైవర్షన్ రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఇతర ఆస్తి నష్టాలను సమగ్రంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించి బాధితులకు తగిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా దమ్మపేట శివారులోని నెమలిపేట గ్రామం ప్రతి భారీ వర్షాకాలంలో వరద ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే తెలిపారు.
గ్రామానికి వరద నీరు చేరకుండా రెండు వైపులా కాలువలకు కాంక్రీట్ గోడల నిర్మాణం చేపట్టనున్నామని, త్వరలోనే పనులు ప్రారంభించి వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసి గ్రామస్తులకు ముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం గ్రామంలో డ్రైనేజీ సమస్యపై గ్రామస్తులతో మాట్లాడారు. సీసీ రోడ్లకు దగ్గరగా ఇళ్ల గోడలు నిర్మించడం వల్ల డ్రైనేజీ నిర్మాణానికి స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గ్రామస్తులంతా పరస్పరం చర్చించుకుని డ్రైనేజీ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
డ్రైనేజీ ఏర్పాటు వల్ల రహదారులపై ప్రవహించే వర్షపు నీరు నేరుగా ఇళ్లలోకి చేరకుండా కాలువల ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రజల సహకారంతోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి బాధితుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి రవీంద్రారెడ్డి, వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కక్కిరాల రమేష్, చిన్నశెట్టి యుగంధర్, వాసం శ్రీనివాసరావు, పగడాల రాంబాబు, పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల, మాజీ సర్పంచ్ కోర్సా సాగర్, పట్వారిగూడెం సర్పంచ్ కూరం అర్జున్ రావు, ఉపసర్పంచ్ బొల్లికొండ నాగేశ్వరరావు, బాలరాజుగూడెం మాజీసర్పంచ్ కుర్సం శ్రీనివాసరావు, జగ్గారం సర్పంచ్, దమ్మపేట మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు వంక జానకిరామ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.