గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం

25-11-2026 | 08:47pm

సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన 

మంత్రి శ్రీధర్ బాబు

మహాదేవపూర్‌లో కొత్త తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం

త్వరలో పూర్తిస్థాయి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు హామీ

మహాదేవపూర్, నవంబర్ 25 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మహాదేవపూర్ మండల ప్రజల చిరకాల ఆకాంక్ష మేరకు దాదాపు రూ.90 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంతో పాటు అగ్నిమాపక కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన భవనం అందుబాటులోకి రావడంతో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందుతాయని తెలిపారు. మహాదేవపూర్‌లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రజల చిరకాల డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. మహాదేవపూర్‌తో పాటు పలిమెల, మహాముత్తారం, కాటారం, మల్హర్ మండలాలకు సత్వర అగ్నిమాపక సేవలు అందేలా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో అన్ని సదుపాయాలతో పూర్తిస్థాయి అగ్నిమాపక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. 

మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఆర్వో వసంతకుమారి, జిల్లా అగ్నిమాపక అధికారి నాగరాజు, శ్రీనివాస్, సర్పంచ్ హసీనా బాను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, దండు రమేష్, పంతగాని తిరుమల, తిరుపతిరెడ్డి, పీఆర్ ఈఈ విద్యాసాగర్, డీఈ సాయిలు, తహసీల్దార్ సత్యనారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు