ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

25-11-2026 | 08:42pm

కరీంనగర్ సిటీ నవంబర్25 (విజయక్రాంతి): కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద బీసీ సంఘాల నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను(Fee Reimbursement Dues) తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సులు పూర్తి చేసిన సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేయడం బాధాకరమన్నారు. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలకు విద్యార్థులు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇతర అవసరాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, పేద విద్యార్థుల చదువులకు సంబంధించిన బకాయిలను విడుదల చేయకపోవడం విద్యార్థి వ్యతిరేక చర్య అని విమర్శించారు. 

బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిగుర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదని, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సమాన విద్యావకాశాలు కల్పించే కీలక పథకమని అన్నారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్యపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలతో చర్చించాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా నిరసన తెలిపి విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు గుంటి స్వరూప, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొని శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ అనుమస నితిన్, అంజాద్, బీసీ మహిళా సంఘం జనరల్ సెక్రటరీ కరుపాక మునక్క, టౌన్ ప్రెసిడెంట్ రాజుల నవ్య, టౌన్ జనరల్ సెక్రటరీ బొంతుల తిరుమల, బీసీ సంఘం నాయకులు రమేష్, అశ్విత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు