వెట్టిచాకిరీ నిర్మూలనకు విస్తృత అవగాహన కల్పించాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, అక్టోబర్ 14 (విజయ క్రాంతి): వెట్టిచాకిరీ, బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ (District Collector Rahul Sharma)అన్నారు. బుధవారం కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సంయుక్తంగా రూపొందించిన ‘స్వేచ్ఛా గమనం’(Swachha Gamanam) ప్రచార రథాన్ని ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పులు, ముందస్తు రుణాల పేరుతో కార్మికులను బలవంతంగా పనిలో కొనసాగిస్తూ వెట్టిచాకిరీ చేయించడం వంటి విధానాలను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. మీ పని.. మీ జీతం.. మీ స్వేచ్ఛ’ నినాదంతో చేపట్టిన ప్రచారం ద్వారా జిల్లాలోని కార్మికులకు వారి హక్కులు, చట్టపరమైన రక్షణలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
పని ప్రదేశాల్లో బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురైనా, వేతనాలు చెల్లించకపోయినా, గుర్తింపు పత్రాలు స్వాధీనం చేసుకున్నా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు 080-69434343 హెల్ప్లైన్ను సంప్రదించాలని కోరారు. జిల్లాను వెట్టిచాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, పౌరసమాజ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అనంతరం వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కార్మిక శాఖ అధికారి వినోద, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి, వ్యవసాయ అధికారి బాబురావు, ఇక్బాల్ పాషా, ప్రసాద్, ప్రదీప్, రాకేష్, నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.