అవార్డుల ఆసుపత్రి నుంచి...ఆరోపణల ఆసుపత్రిగా...!

14-10-2026 | 01:48pm
  1. ప్రైవేటు వైద్యులు, అంబులెన్సుల ప్రభావంలో ప్రభుత్వ ఆసుపత్రి...?
  2. పేద రోగుల గోడు పట్టించుకునేదెవరు... విధుల నిర్లక్ష్యంపై వరుస ఆరోపణలు...
  3. పేదల వైద్య సేవల కోసం నిర్మించిన మాతా శిశు ఆసుపత్రిలో ఏం జరుగుతోంది...? 
  4. ఉన్నతాధికారుల సమీక్షలు ఎక్కడ? బాధ్యులపై చర్యలు ఎప్పుడు?
  5. ఘటన జరిగితే విధులు మానేస్తామంటూ హెచ్చరికలా...
  6. బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై ఉన్నతాధికారులు స్పందించరా...?

బాన్సువాడ, అక్టోబర్ 14 (విజయ క్రాంతి): పేదల వైద్య సేవల కోసం నిర్మించిన మాతా శిశు ఆసుపత్రిలో ఏం జరుగుతోంది? ఉన్నతాధికారుల సమీక్షలు ఎక్కడ? బాధ్యులపై చర్యలు ఎప్పుడు? పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) సుమారు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించిన బాన్సువాడ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి పనితీరు ఇప్పుడు విమర్శలకు కేంద్రంగా మారుతోంది.

ఒకప్పుడు పెద్ద ఆసుపత్రిగా గుర్తింపు పొందిన ఈ వైద్య కేంద్రం వరుస అవార్డులతో దేశంలోనే ఉత్తమ ఆసుపత్రిగా పేరుగాంచినప్పటికీ ప్రస్తుతం వరుస ఘటనలు, వైద్య సేవలపై వస్తున్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవల పర్యవేక్షణ, ఉన్నతాధికారుల సమీక్షలపై ప్రశ్నలువెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల సిజేరియన్‌ ప్రసవాల అనంతరం ఐదుగురు బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, వైద్య సేవల్లో ఎక్కడైనా లోపాలు జరిగాయా అనే అంశాన్ని పరిశీలించారు.

అయితే, ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై తుది నిర్ధారణ లేకుండా నిర్లక్ష్యమే కారణమని తేల్చి చెప్పలేని పరిస్థితి ఉంది. ఇది మరవక ముందే ఇటీవల గర్భంలోనే శిశువు మృతి చెందిన ఘటన చోటు చేసుకోవడంతో ఆసుపత్రి తీరుపై ప్రజలు తీవ్ర విమర్శలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైద్య సేవలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పేద రోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి, ప్రైవేటు ఆసుపత్రులకు రోగుల తరలింపు వ్యవహారాలపై వస్తున్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రభుత్వ ఆసుపత్రి ప్రజల ఆస్తి.. పేదల ప్రాణాలకు భరోసా. ఆ భరోసా నిలబెట్టడం అధికారుల బాధ్యత. ఆరోపణలకు సమాధానాలు చెప్పి, వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటు ప్రభావం ఉందా...?

ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే పేద రోగులకు సరైన సేవలు అందుతున్నాయా? అత్యవసర పరిస్థితుల్లో వారికి తగిన వైద్య సహాయం లభిస్తోందా? ప్రైవేటు ఆసుపత్రులు, అంబులెన్సుల వ్యవహారంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అన్న ప్రశ్నలు స్థానికంగా చర్చకు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

ఘటన జరిగితే విధులు మానేస్తామంటూ హెచ్చరికలా?

ఆసుపత్రిలో ఏదైనా ఘటన చోటుచేసుకున్నప్పుడు విధులు నిర్వహించబోమంటూ కొందరు వైద్యులు, సిబ్బంది హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? విధుల నిర్వహణకు ఆటంకాలు ఎందుకు ఎదురవుతున్నాయి? రోగులకు ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలను కొనసాగించాల్సిన బాధ్యత ఎవరిది? అనే అంశాలపై ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

పేద రోగుల ప్రాణాలకు భరోసా ఏది?

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్యం అందడం అత్యంత ముఖ్యం. ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు ప్రభుత్వ వైద్య సేవలే ప్రధాన ఆధారం. అలాంటి ఆసుపత్రిలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. విధుల్లో ఎవరు నిర్లక్ష్యం వహించినా, రోగులకు అన్యాయం జరిగినా బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.

అవార్డుల ప్రతిష్ఠ నిలబెట్టేదెవరు?

ఒకప్పుడు అవార్డులతో గుర్తింపు పొందిన ఆసుపత్రిలో ఇప్పుడు తరచూ వివాదాలు, నిర్లక్ష్య ఆరోపణలు ఎందుకు తెరపైకి వస్తున్నాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రి పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? వైద్య సేవల నాణ్యతను సమీక్షిస్తున్నారా? రోగుల ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

ఉన్నతాధికారులు స్పందించాలి...

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై వస్తున్న ఆరోపణలన్నింటిపైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలి. వైద్యులు, సిబ్బంది విధుల హాజరు, రోగులకు అందుతున్న సేవలు, ప్రైవేటు ఆసుపత్రులకు రిఫరల్ ప్రక్రియ, అంబులెన్సుల వ్యవహారాలను పరిశీలించాలి. తప్పులు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా పర్యవేక్షణను పటిష్ఠం చేయాలి.

మరిన్ని వార్తలు