బీర్కూర్ ఎంజేపీ పాఠశాలలో విద్యార్థికి వైద్యసేవల జాప్యం

24-11-2026 | 03:56pm

బాన్సువాడ, నవంబర్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉంది. అయితే కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన సిబ్బంది పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఛాతినొప్పితో బాధపడుతున్న విద్యార్థిని సకాలంలో ఆసుపత్రికి తరలించలేదని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పెద్దకొడపగల్ మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఓం ప్రశాంత్ బీర్కూర్ ఎంజేపీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో స్నానానికి వెళ్లి బాత్‌రూమ్‌లో కాలుజారి పడిపోయాడు. ఈ ఘటనలో అతని ఛాతికి గాయమై నొప్పి కలిగింది. వెంటనే తన సమస్యను క్లాస్ లీడర్‌కు (Class Leader) తెలియజేయగా, అతను పాఠశాల నర్సుకు (Staff Nurse) సమాచారం అందించాడు.

నర్సు ఆయింట్‌మెంట్ రాసి, వేడి అన్నంతో కాపడం పెడితే నొప్పి తగ్గుతుందని సూచించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంతరం విద్యార్థి హౌస్ మాస్టర్‌కు కూడా విషయం తెలియజేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పినప్పటికీ, ఒకరోజు గడిచినా వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నొప్పి తీవ్రం కావడంతో మంగళవారం ఉదయం విద్యార్థి తన తండ్రికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. దీంతో అందుబాటులో ఉన్న అతని తాత వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. గాయపడిన విషయం తెలిసినప్పటికీ నర్సు, హౌస్ మాస్టర్ తగిన స్థాయిలో స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురైతే తక్షణ వైద్య సహాయం (Medical Assistance) అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై లేదా? విద్యార్థుల ఆరోగ్య భద్రత విషయంలో ఇంత జాప్యం ఎందుకని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, విధుల్లో నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గురుకులాల్లో అత్యవసర వైద్య సేవలు అందించే విధానాన్ని పటిష్టం చేయాలని కోరుతున్నారు.

ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ కేతావత్ గోపీచంద్‌ను విజయక్రాంతి వివరణ కోరగా, ఈ ఘటన తన దృష్టికి రాలేదని తెలిపారు. వెంటనే స్టాఫ్ నర్సు, హౌస్ మాస్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకుని, విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తానని చెప్పారు. అయితే పాఠశాలలో జరిగిన ఘటన ప్రిన్సిపాల్ దృష్టికి రాకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు