నకిలీ లోన్ యాప్‌ల ఉచ్చులో పడొద్దు
తాడ్వాయి, నవంబర్ 21 (విజయక్రాంతి): నకిలీ లోన్ యాప్‌ల (Fake Loan Apps) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడ్వాయి ఎస్సై నరేష్ సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల గుర్తుతెలియని, అనుమతి లేని రుణ యాప్‌ల ద్వారా సులభంగా అప్పులు ఇప్పిస్తామంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
మొదట సులభంగా రుణాలు (Instant Loans) ఇస్తామని నమ్మించి, ఆ తర్వాత అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని వివరించారు. అప్పులు తీసుకున్న వారిని ఫొటోలు మార్ఫింగ్ (Photo Morphing) చేసి బంధువులు, స్నేహితులకు పంపిస్తామని బెదిరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.
ఇలాంటి నకిలీ యాప్‌ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. గుర్తుతెలియని యాప్‌లను నమ్మి వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, బ్యాంకు సమాచారం ఇవ్వవద్దని, ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.