గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ

29-11-2026 | 06:12pm

కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గిరిజన యువతకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సౌజన్య తెలిపారు. కొత్త బ్యాచ్‌లో చేరేందుకు అర్హులైన యువతీయువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక (Prajapalana Pragathi Plan)లో భాగంగా నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి (Employment), స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కామారెడ్డి జిల్లా నుంచి 141 మంది అర్హులైన నిరుద్యోగ గిరిజన యువతీయువకులను ఎంపిక చేసి వివిధ నైపుణ్యాభివృద్ధి శిక్షణ (Skill Development Training) కార్యక్రమాల కోసం హైదరాబాద్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. వీరిలో శిక్షణ పూర్తి చేసుకున్న 99 మందిలో ఇప్పటికే 63 మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. వారిలో 32 మంది వేతన ఉపాధి పొందుతుండగా, మరో 31 మంది స్వయం ఉపాధి ద్వారా స్థిరపడ్డారని వివరించారు. మిగిలిన 42 మంది ప్రస్తుతం హైదరాబాద్‌లోని మెగా స్కిల్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు.

శిక్షణ పూర్తి చేసుకుని వేతన ఉపాధి సాధించిన 32 మంది అభ్యర్థులను డిసెంబర్ 4న జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సన్మానించనున్నట్లు వెల్లడించారు.

కొత్త బ్యాచ్‌లో చేరేందుకు ఆసక్తి, అర్హత కలిగిన కామారెడ్డి జిల్లాకు చెందిన నిరుద్యోగ గిరిజన యువతీయువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిక్షణ ద్వారా ఉపాధి, స్వయం ఉపాధి (Self Employment) అవకాశాలు పొందాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సౌజన్య ఒక ప్రకటనలో కోరారు.

మరిన్ని వార్తలు