డయాలిసిస్ పేషెంట్ల కోసం ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్!

29-11-2026 | 05:47pm

మహబూబాబాద్: డయాలిసిస్(Dialysis) అంటే ఆహారంపై ఎన్నో ఆంక్షలు.. నచ్చిన వంటకాలను తినలేని పరిస్థితి.. ఉప్పు, నీరు, కొన్ని పోషకాల విషయంలో నిరంతర జాగ్రత్తలు. అయితే వైద్యుల సూచనలు పాటిస్తూనే రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చనే అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్‌లో ప్రత్యేక ఆహారోత్సవం నిర్వహించారు. నెఫ్రోప్లస్ ఆధ్వర్యంలో ధరణి హాస్పిటల్‌(Dharani Hospital)లో తొలిసారిగా 'డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం' నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది రోగులు, వారి కుటుంబ సభ్యులు, సంరక్షకులు పాల్గొన్నారు. నిప్పు ఉపయోగించకుండా వంటకాలు తయారు చేసే ప్రత్యేక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ప్రత్యామ్నాయ పదార్థాలతో సులభంగా, రుచిగా, డయాలిసిస్‌కు అనుకూలమైన వంటకాలను ఎలా సిద్ధం చేసుకోవచ్చో ప్రదర్శించారు. రోగులు తమ వంటకాల ఆలోచనలు, అనుభవాలను కూడా పంచుకున్నారు. ఆహార నియమాలపై అవగాహనే లక్ష్యం: డయాలిసిస్ చికిత్స పొందుతున్నవారు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్లు, ద్రవాల పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఉప్పు వినియోగం తగ్గించడం, ద్రవాలను నియంత్రించడం, సరైన ఆహార పదార్థాలను ఎంచుకోవడం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన వంటకాల తయారీ ప్రదర్శనలు, పోషకాహార చర్చలు, రోజువారీ ఆహార సమస్యలపై సూచనలు అందించారు. డయాలిసిస్ రోగుల ఆహార నియంత్రణలో కుటుంబ సభ్యుల పాత్ర కూడా కీలకమని వివరించారు. సరైన ఆహార ప్రణాళిక, పరిమాణ నియంత్రణ, వైద్యులు, పోషకాహార నిపుణుల సూచనలతో రుచికరమైన భోజనాన్ని కూడా ఆస్వాదించవచ్చనే సందేశాన్ని ఈ ఆహారోత్సవం అందించింది.

మరిన్ని వార్తలు