కేసీఆర్ నిరాహార దీక్ష చరిత్రలో నిలిచిపోయింది: కేటీఆర్

29-11-2026 | 05:54pm

తెలంగాణ రాష్ట్ర సాధన (Statehood Movement) కోసం అప్పటి టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష (Hunger Strike) చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించిన దీక్షా దివస్ (Deeksha Diwas) సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ దీక్షకు బయలుదేరిన రోజు తనకు ఇప్పటికీ గుర్తుందని, ఉద్యమ సమయంలో జరిగిన ఘటనలను గుర్తుచేసుకున్నారు.

దీక్షకు బయలుదేరిన కేసీఆర్ కారును పోలీసులు వెంబడించి అలుగునూరు వద్ద అడ్డుకున్నారని కేటీఆర్ తెలిపారు. అనంతరం కేసీఆర్ చేపట్టిన 11 రోజుల దీక్ష తెలంగాణ ఉద్యమంలో పెను ప్రభంజనంగా మారిందన్నారు.కేసీఆర్ దీక్షతో తెలంగాణ అగ్నిగుండంగా మారిందని, యూనివర్సిటీలు యుద్ధభూములను తలపించాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతంగా సాగడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు.

కేసీఆర్ అరెస్టు విషయం తెలుసుకున్న శ్రీకాంత్ చారి పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడిన ఘటనను కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన (Telangana Formation) పోరాటంలో దీక్షా దివస్ కీలక ఘట్టమని, ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.

మరిన్ని వార్తలు