స్టార్టప్‌ల వైపు యువత పరుగులు!

29-11-2026 | 05:40pm

న్యూఢిల్లీ: ఉద్యోగం సంపాదించడమే కాదు.. సొంతంగా వ్యాపారం ప్రారంభించి పదిమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచన భారతీయుల్లో పెరుగుతోంది. వ్యాపారవేత్తగా ఎదగడం ఇప్పుడు కొత్త కెరీర్ ట్రెండ్‌గా మారుతోంది. తాజాగా లింక్డ్‌ఇన్(LinkedIn) నిర్వహించిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న ప్రతి 100 మంది భారతీయుల్లో 85 మంది సొంత వ్యాపారం ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా జెన్‌జీ యువతలో 94 శాతం మందికి వ్యవస్థాపకులుగా ఎదగాలనే ఆకాంక్ష ఉండగా, మిలీనియల్స్‌లో ఈ సంఖ్య 90 శాతంగా ఉంది.

జెన్‌జీ యువతలో ప్రతి పది మందిలో ఏడుగురు వచ్చే మూడేళ్లలో వ్యాపారం లేదా సైడ్ బిజినెస్ ప్రారంభించాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. మహిళల్లో 91 శాతం, పురుషుల్లో 94 శాతం మంది వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని ఆశిస్తున్నారు. ఈ ఆసక్తి ఆచరణలోనూ కనిపిస్తోంది. 2022 నుంచి లింక్డ్‌ఇన్ ప్రొఫైళ్లలో 'ఫౌండర్' (వ్యవస్థాపకుడు) అనే హోదాను చేర్చుకున్న సభ్యుల సంఖ్య 190 శాతం పెరిగింది. జెన్‌జీ విభాగంలో ఈ పెరుగుదల ఏకంగా 383 శాతంగా నమోదైంది.

ప్రస్తుతం లింక్డ్‌ఇన్‌లోని వ్యవస్థాపకుల్లో మిలీనియల్స్ 48 శాతం వాటాతో ముందున్నారు. ఏఐతో సులభమవుతున్న బిజినెస్.. యువతకు కొత్త అవకాశాలు: డిజిటల్ సాధనాలు, సోషల్ మీడియా, కృత్రిమ మేధ (AI) అందుబాటులోకి రావడంతో వ్యాపార రంగంలోకి ప్రవేశించే అవకాశాలు పెరుగుతున్నాయి. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం వ్యవస్థాపకులుగా మారేందుకు మెరుగైన అవకాశాలున్నాయని 86 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ద్వారా వినియోగదారులను చేరుకోవచ్చని 74 శాతం మంది, వ్యాపార పరిజ్ఞానాన్ని సులభంగా పొందవచ్చని 63 శాతం మంది తెలిపారు.

వ్యాపార గుర్తింపు, కస్టమర్లు, భాగస్వాములతో అనుసంధానానికి లింక్డ్‌ఇన్ వంటి వేదికలు ఉపయోగపడుతున్నాయని 42 శాతం మంది పేర్కొన్నారు. మరోవైపు చిన్న వ్యాపార వ్యవస్థాపకుల్లో పది మందికి తొమ్మిది మందికి పైగా ఏఐ సాధనాలను వినియోగిస్తున్నారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో గతంలో అందించలేని ఉత్పత్తులు, సేవలను అందించగలుగుతున్నామని 36 శాతం మంది తెలిపారు. ఈ సాంకేతికత లేకపోతే వ్యాపారానికి మరింత పెట్టుబడి అవసరమయ్యేదని 23 శాతం మంది అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూడటంతో పాటు సొంత వ్యాపారాల ద్వారా ఎదగాలనే దిశగా భారతీయుల కెరీర్ ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు