ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు

18-11-2026 | 05:25pm

కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవాలి

బీజేపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి

హుజురాబాద్,నవంబర్18: (విజయక్రాంతి) : కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండల(Illandakunta Mandal) పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Grain purchasing centers) వెంటనే ప్రారంభించి, రైతులు(Farmers) పండించిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని బీజేపీ(BJP) ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ మండల శాఖ(BJP Mandal Branch) ఆధ్వర్యంలో మంగళవారం ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయంలో(Illandakunta Tahsildar Office) ఎమ్మార్వో మనోజ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. అహర్నిశలు శ్రమించి రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు. తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, ఇతర అవసరమైన సౌకర్యాలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాసే పరిస్థితి రాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రైతుల సంక్షేమమే దేశ సంక్షేమమని, రైతులకు అన్యాయం జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అధికారులు వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రైతుల పక్షాన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంగ్లే ప్రభాకర్, చింతల ఐలయ్య, గుడికందుల పావని, జోడు సంపత్, గురుకుంట్ల సంజీవ్, రావుల అశోక్, శనిగరపు శ్రవణ్, వడ్లకొండ జలపతితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు