పోలీసులకు హైకోర్టు నోటీసులు

18-11-2026 | 11:59am

టాస్క్‌ఫోర్స్ పోలీసులకు హైకోర్టు నోటీసులు.. సోదాలపై వివరణ కోరిన న్యాయస్థానం

హైదరాబాద్: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలు, సోదాల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు(Telangana High Court) చేరింది. చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా పోలీసులు Search Operations నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై న్యాయస్థానం స్పందించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పోలీసు అధికారులకు Notices జారీ చేసింది. ఆరోపణలపై పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బోరబండకు చెందిన బి. బాలరాజ్ దాఖలు చేసిన Writ Petitionపై జస్టిస్ మాధవి దేవి విచారణ చేపట్టారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పోలీసు యూనిఫాం లేకుండా సాధారణ పౌరుల మాదిరిగా వచ్చి తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. అంతేకాకుండా ఎలాంటి FIR నమోదు చేయకుండానే ఇళ్లలో సోదాలు చేయడం, వస్తువులను స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో కీలక వాదనలు వినిపించారు. FIR నమోదు కాకముందే ఏకపక్షంగా Investigation చేపట్టడం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) 2023 నిబంధనలకు విరుద్ధమని వాదించారు. సంబంధిత వ్యక్తులకు తమ వాదన వినిపించే అవకాశం కల్పించకుండా, ఎలాంటి Transparency లేకుండా తనిఖీలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరో కీలక అంశాన్ని కూడా న్యాయవాది ప్రస్తావించారు. Search Warrants జారీ చేసే అధికారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు మాత్రమే ఉంటుందని, ఏసీపీ స్థాయి అధికారులు సెర్చ్ వారెంట్లు జారీ చేయడం చట్టబద్ధం కాదని వాదించారు. పోలీసుల తనిఖీలకు సంబంధించి చట్టపరమైన పరిమితులను పాటించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. 

ఈ వాదనలను పరిశీలించిన హైకోర్టు.. రాష్ట్ర హోంశాఖ, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలకు Notices జారీ చేసింది. పిటిషన్‌లో లేవనెత్తిన ఆరోపణలపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్‌కు వాయిదా వేసింది. టాస్క్‌ఫోర్స్ తనిఖీలపై హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో పోలీసు వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అసలు సోదాలు ఏ నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారు? పిటిషనర్ ఆరోపణలపై పోలీసు శాఖ ఎలాంటి సమాధానం ఇస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు