సిరిసిల్ల కంచుకోట.. ఇప్పుడు మంచుకోట

18-11-2026 | 04:58pm
  1. కేటీఆర్ దోపిడీ బండారం బట్టబయలు
  2. గడ్డం పెంచుకొని యాత్ర చేస్తే ప్రజలు నమ్మరు
  3. సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి

గంభీరావుపేట, నవంబర్ 18 (విజయక్రాంతి): కేటీఆర్(KTR) కంచుకోటగా భావిస్తున్న సిరిసిల్ల ఇప్పుడు మంచుకోటగా మారిందని, పదేళ్ల అధికారంలో ప్రజాధనాన్ని దోచుకుని దాచుకున్నారని సిరిసిల్ల నియోజకవర్గ(Sircilla Constituency) కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి(In-charge KK Mahender Reddy) విమర్శించారు.

బుధవారం గంభీరావుపేట మండలం కొత్తపల్లి, కొలమద్ది, లింగన్నపేట గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ గడ్డం పెంచుకొని ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, యాత్రలో దోచుకుని దాచుకున్న సొమ్ము గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల జిల్లాలో తన అనుచరులకు తొమ్మిది వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా అప్పగించారని ఆరోపించారు. తొమ్మిదో ప్యాకేజీ పనులను నిర్లక్ష్యం చేసి డ్రగ్స్, ఇసుక, బట్టల మాఫియాలను ప్రోత్సహించారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు చేసిన త్యాగాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగ నియామకాలు చేపట్టిందన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తూ వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు హాస్టల్ ఛార్జీలు పెంచామని,

చరిత్రలో నిలిచిపోయేలా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించనుందని పేర్కొన్నారు.సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్ కుటుంబ వ్యవహారాలను ఆధారాలతో సహా బయటపెట్టారని మహేందర్‌రెడ్డి అన్నారు. రేపు సిద్ధిపేటలో జరిగే సీఎం సభకు ఈ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్‌పై ఆధారపడతారా లేక ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి వస్తారా తేల్చుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మహమ్మద్ హమీద్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటి, నాయకులు మేడ భాస్కర్, అజ్మీరా భాస్కర్ నాయక్, గోపాల్‌రెడ్డి, గంగి స్వామి, ఎలుక రాజు, శ్రీనివాస్‌రెడ్డి, రాయనర్సు, ఒరగంటి నర్సింలు, నుశ్రత్, రాజారాంరెడ్డి, కిషన్, రాజం, అంజగౌడ్, రవి, రాజు, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు