దివ్యాంగులకు పెన్షన్ మంజూరు పత్రాలు
- పక్షపాతం లేకుండా బీదల సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్
కేసముద్రం, నవంబర్ 18 (విజయక్రాంతి): పక్షపాతం లేకుండా, పార్టీలకతీతంగా బీదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress People Government) పాటుపడుతోందని, గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అర్హులైన పేదలను నిష్పక్షపాతంగా గుర్తించి చేయూత పథకం(Cheyutha Scheme) ద్వారా పింఛన్లు అందించి ఆర్థికంగా నిలబెడుతోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు.
చేయూత పథకం ద్వారా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. కేసముద్రం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల వరకే పార్టీలని, ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకొని పోతోందని తెలిపారు.
నియంతృత్వ పద్ధతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అవలంబించడం లేదని పేర్కొన్నారు. ఎక్కడ కూడా బేషజాలకు పోకుండా కేసముద్రం పట్టణ అభివృద్ధి కోసం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కృషితో 500 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, కేసముద్రం పట్టణాన్ని రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
పేదల ఆర్థిక అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ, ట్రాన్స్పోర్ట్ కమిటీ మెంబర్ రావుల మురళి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.