బతుకుదెరువు కోసం ఊరును విడిచి వలసబాట

18-11-2026 | 05:19pm
  1. ఇంటికి తాళం వేసి పిల్లాపాపలతో ఇతర ప్రాంతాలకు పయనం
  2. చెరుకు నరికే పనులే గిరిజన కుటుంబాలకు జీవనాధారం
  3. స్థానికంగా ఉపాధి కల్పిస్తే వలసలకు తగ్గుదల

నాగల్‌గిద్ద, నవంబర్ 18 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలంలోని పలు గిరిజన తండాలకు(Tribal hamlet) చెందిన కుటుంబాలు జీవనోపాధి (Livelihood) కోసం సొంత ఊళ్లను విడిచి వలస వెళ్తున్నాయి. స్థానికంగా సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చెరుకు నరికే పనుల కోసం కర్ణాటక రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాలు, జహీరాబాద్ పరిసర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

ఇంటికి తాళం వేసి, ఇంటి సామగ్రిని సర్దుకొని పిల్లాపాపలతో ఎడ్లబండ్లపై ప్రయాణమవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చెరుకు నరికే పనుల్లో భార్యాభర్తలిద్దరూ పాల్గొనాల్సి రావడంతో పిల్లలను సైతం తమ వెంట తీసుకెళ్తున్నారు. కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వలస వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఈ వలసల కారణంగా చిన్నారుల చదువులకు ఆటంకం కలగకుండా స్థానికంగా సీజనల్ హాస్టల్ వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. గిరిజన కుటుంబాలకు గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు పెంపొందించి, వారి జీవనోపాధికి తోడ్పాటు అందిస్తే వలసల అవసరం తగ్గుతుంది. ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతూ కుటుంబాలతో సంతోషంగా జీవించే పరిస్థితులు రావాలని గిరిజన కుటుంబాలు ఆశిస్తున్నాయి.

మరిన్ని వార్తలు