వెలిగిన దీపం
- సుప్రీంకోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
- తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీప ప్రజ్వలన
- అరుదైన ఘట్టాన్ని తిలకించిన హిందువులు, ముస్లింలు
- భద్రతా సిబ్బంది, అధికారులపై పూలు చల్లుతూ స్వాగతం
మధురై, నవంబర్ 28: ‘మురుగన్ స్వామికి జయహో, విజయాన్ని ప్రసాదించే శక్తికి వందనం’ అంటూ భక్తుల జయజయ ధ్వానాల మధ్య తిరుప్పరంకుండ్రం కొండపై(Tirupparankundram Hill) కార్తీక దీపం వెలిగింది. మధురై సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుప్పరంకుడ్రం కొండపై ఉన్న పురాతన దీపతూన్ (దీప స్తంభం) వద్ద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కార్తీక దీపా న్ని శనివారం సాయంత్రం 5.02 గంటలకు వెలిగించారు.
సుప్రీంకోర్టు నియ మించిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.వైద్యనాథన్, జస్టిస్ వీ పార్థిబన్ పర్యవేక్షణలో దీప ప్రజ్వలన చేయగానే ప్రజలు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. భద్రతా కారణాల దృష్ట్యా కొండపైకి 50 మంది భక్తులను మాత్రమే అనుమతించారు. ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు కొండ దిగువన ఉదయం నుంచే బారులు తీరారు. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వచ్చిన అధికారులపై, భద్రతా సిబ్బందిపై పూలు చల్లుతూ భక్తులు స్వాగతించారు.
భక్తుల ఆనందోత్సాహాలు, జయజయ ధ్వానాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అపురూప దృశ్యాన్ని భక్తులు తిలకిస్తూ ఆధ్యాత్మిక భావోద్వేగంతో చేతులు జోడించి, ఆనంద బాష్పాలు రాలుస్తూ లీనమైపోయారు. దర్గాను సందర్శించడానికి వచ్చిన ముస్లింలు కూడా హిందువులతో కలిసి కార్తీక దీపం వెలిగించే కార్యక్రమాన్ని తిలకించడం విశేషం. నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపిన కార్తీక దీపం వివాదంలో కీలక ఘట్టం ముగిసింది.
ప్రత్యేక బలగాలతో భద్రత
సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు జస్టిస్ ఎస్ వైద్యనాథన్, జస్టిస్ వీ పార్థిబన్ ఉదయమే చెన్నై నుంచి మదురై చేరుకున్నారు. సంప్రదాయ వాయిద్యాల నడుమ మట్టి ప్రమిదలు, నెయ్యి, వత్తులను కొండ దిగువకు తీసుకొచ్చి ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయంలో పూజలు నిర్వహించి.. కొప్పరైగా పిలిచే సంప్రదాయ రాగి పాత్రను అర్చకులకు అప్పగించారు. దీపతూన్ వద్ద ఆ పాత్రను ఉంచేందుకు సిబ్బంది తాత్కాలిక వేదికను ఏర్పాటు చేశారు.
దీప ప్రజ్వలన కోసం 30 గ్రాముల నెయ్యి, 50 మీటర్ల పొడవైన దూది వత్తి, ఐదు కిలోల కర్పూరాన్ని సిద్ధం చేశారు. కార్యక్రమంలో మదురై కలెక్టర్ నిశాంత్ కృష్ణ, పోలీసు అధికారులు, భారత పురావస్తు శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. దీప ప్రజ్వలన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు భారీగా తరలి రావడంతో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య బృందాలను, అంబులెన్సులను కూడా సిద్ధం గా ఉంచారు. మరోవైపు.. కొండపై ఉన్న హజ్రత్ సుల్తాన్ సికిందర్ బాద్షా ఔలియా దర్గాలోనూ భక్తులు ప్రార్థనలు చేశారు.