2029 నాటికి నషాముక్త్ భారత్ లక్ష్యం
- నేషన్ ఫస్ట్ నినాదంతో విద్యార్థులు ముందుకు సాగాలి
- వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి
- కేయూ 24వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
మహబూబాబాద్/హనుమకొండ, నవంబర్ 28 (విజయక్రాంతి): 2029 నాటికి నషాముక్త్ భారత్(Drug-Free India) లక్ష్యమని, అందుకు విద్యార్థులు, యువత నడుం బిగించాలని రాష్ట్ర గవర్నర్, కాకతీయ విశ్వవిద్యాలయ ఛాన్సలర్(Chancellor of Kakatiya University) శివ్ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలన్నారు. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలన్నారు.
శనివారం హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగిన విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. పీహెచ్‌డీలు అందుకున్న పరిశోధకులు, బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. 1976 ఆగస్టు 19న స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం తెలంగాణలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలను అందిస్తూ, అనేక కుటుంబాల్లో తొలి తరం పట్టభద్రులను తయారు చేసిందన్నారు.
విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధనా మార్గదర్శకుల ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ సేవా పథకం, జాతీయ క్యాడెట్ కారప్స్ ద్వారా క్రమశిక్షణ, జట్టు టీమ్ స్పిరిట్, సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీలు, నైపుణ్యాభివృద్ధి వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు.
యువత నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. ప్రధాని మోదీ నషాముక్త భారత్ లక్ష్యాన్ని దేశం ముందుంచారని, 2029 నాటికి మాదకద్రవ్యాల రహిత భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పానికి యువత తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలని సూచించారు. రూసా, పీ ఎం ఉష వంటి జాతీయ కార్యక్రమాలు రాష్ట్ర విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయని గవర్నర్ అన్నారు.
ఔషధ పరిశోధన, మెటీరియల్స్, ఔషధ మొక్కలు, డిజిటల్ వ్యవస్థలు వంటి రంగాల్లో పరిశోధనలు సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను అందించగలవన్నారు. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం, పరిశ్రమలు, పూర్వ విద్యార్థులు సమన్వయంతో పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశ ప్రగతికి మరింత బలమైన తోడ్పాటు అందించగలరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 91మందికి పీహెచ్‌డీ, పట్టభద్రులకు డిగ్రీ పట్టాలను, మొత్తం 48 మందికి బంగారు పతకాలు గవర్నర్ ప్రదానం చేశారు.
అంతకుముందు కేయూ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న గవర్నర్‌కు కలెక్టర్లు చాహత్ బాజ్ పాయ్, డాక్టర్ సత్య శారద, ఎన్ శ్వేత, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, వైస్ చాన్సలర్ ప్రతాప్‌రెడ్డి స్వాగతం పలికారు.