రేషన్ బియ్యం అక్రమ రవాణా?
- నిర్మల్ నుంచి మహారాష్ట్రకు తరలింపు
- గ్రామాల్లో యథేచ్ఛగా సేకరణ
- రాత్రివేళ సరిహద్దులు దాటుతున్న వాహనాలు
- అక్రమ దందాలో ప్రజాపతినిధులు పాత్ర!
నిర్మల్, నవంబర్ 28 (విజయకాంత్రి): పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కులకు(Illegal diversion of ration rice) ఆదాయ వనరుగా మారుతోంది. నిర్మల్, భైంసా కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందా జిల్లాను దాటి మహారాష్ట్రకు విస్తరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్, కబూతర్ కమాన్, బైల్ బజార్, భైంసాలోని పురాణగల్లి, నయాబస్తీ, పార్టీ రోడ్డు పరిసరాలు బియ్యం సేకరణ, నిల్వ, వ్యాపారానికి కేంద్రాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తే అక్రమ దందా మూలాలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి గ్రామాలు సేకరణ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొందరు లబ్ధిదారులు వినియోగించుకోకుండా దళారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు వ్యాపారులు నేరుగా రేషన్ డీలర్ల వద్ద నుంచే బియ్యం కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరగడం, ధరలు అధికంగా ఉండటంతో ఈ అక్రమ వ్యాపారం మరింత జోరందుకున్నట్లు సమాచారం. గతంలో కిలోకు రూ.20 వరకు ఉన్న రేషన్ బియ్యం ధర ప్రస్తుతం రూ.30 నుంచి రూ.35 వరకు పలుకుతున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇదే బియ్యాన్ని మహారాష్ట్రలో కిలో రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధరల మధ్య వ్యత్యాసమే అక్రమ రవాణాకు ప్రధాన కారణంగా మారుతోంది. తక్కువ ధరకు సేకరించి, సరిహద్దులు దాటించి అధిక ధరకు విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
చెక్‌పోస్టుల్లో తనిఖీలు లేవు
సరిహద్దులు దాటే నిత్యావసర సరుకుల రవాణాపై నిఘా ఉంచాల్సిన చెక్‌పోస్టుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాల్లో తరలించే సరుకులకు సంబంధించి అవసరమైన పత్రాలను పరిశీలించి, అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ స్థాయిలో తనిఖీలు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు ఉన్నా అక్రమ రేషన్ బియ్యం రవాణాను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వ్యాపారులు ముందుగానే వాహనాల వివరాలను సిబ్బందికి చేరవేస్తున్నారని, కొందరితో కుమ్మక్కై తనిఖీలు లేకుండానే వాహనాలను సరిహద్దులు దాటిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రస్థాయి ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భాల్లోనే అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాలు పట్టుబడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. స్థానికంగా నిరంతర నిఘా, తనిఖీలు ఉంటే అక్రమ రవాణాకు ఎందుకు అడ్డుకట్ట పడటం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నిర్మల్ జిల్లా కేంద్రంలో కౌన్సిలర్ల భర్తలు కొన్ని సంవత్సరాల నుండి ఈ అక్రమ బియ్యం దండాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో వేరువేరుగా బియ్యం వ్యాపారం నిర్వహించే వారు కానీ ఇప్పుడు సిండికేట్ గా మారి ప్రతినెల వాహనాల్లో రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పేదల కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖ అధికారులపై ఉంది.
సరిహద్దులే దారులు
నిర్మల్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ను ఆనుకుని ఉండటంతో అక్రమ బియ్యం రవాణాకు అనువైన మార్గాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా సారంగాపూర్ మండలంలోని అప్పారావుపేట్, శివిని పరిసరాలు, లక్ష్మణాచందా మండలం వడ్యాల్, కుంటాల మండలంలోని దవునెల్లి, కుబీర్ మండలంలోని పార్టీ (బి), పల్సి, సిర్పెల్లి, తా నూర్ మండలంలోని బెల్తరోడ, మొగిలి, జోల, మహాలింగి, ముధోల్ మండలంలోని బిద్రెల్లి, టాక్లి, దూద్‌పూర్, సరస్వతినగర్ మార్గాల మీదుగా మహారాష్ట్రలోని ధర్మాబాద్ కు బియ్యం తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మార్గాల గుండా వాహనాల్లో బి య్యం మహారాష్ట్రలోని ధర్మాబాద్, బోక ర్, ఉమ్రి, ఇస్లాపూర్, హిమాయత్‌నగర్ ప్రాంతాలకు చేరుతున్నట్లు సమాచారం.