కొనసాగుతున్న జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

20-11-2026 | 03:52pm

శిబిరాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్

ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' రూ. 5 లక్షల జీవిత బీమా పథకం దరఖాస్తుల(Indiramma Family Life Insurance application) స్వీకరణ కార్యక్రమం కరీంనగర్ నగరంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,  డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Yadagiri Sunil Rao) శుక్రవారం సంబంధిత నమోదు శిబిరాన్ని సందర్శించి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.

ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, నిబంధనలపై అధికారులను అడిగి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ. 5 లక్షల జీవిత బీమా ప్రయోజనాన్ని అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. కుటుంబాన్ని పోషించే 18 నుండి 59 ఏళ్ల వయస్సు గల వ్యక్తి ఈ బీమా కు అర్హులని, వయస్సు ధృవీకరణ కు ఆధార్ కార్డు ప్రతిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారని తెలిపారు.

అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సమీపంలోని మున్సిపల్ కార్యాలయంలో లేదా వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొయినుద్దీన్, ఆర్ఐలు కలీముల్లా ఖాన్, కొత్తకొండ శ్యామ్ సుందర్, వార్డు ఆఫీసర్ పారిపెల్లి రాజు, జవాన్ నాగరాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు