సంక్రాంతికి చెరువులోకి గోదావరి జలాలు.. మంత్రి తుమ్మల ఆదేశాలు

20-11-2026 | 04:14pm

దమ్మపేట, నవంబర్ 20 (విజయక్రాంతి): వచ్చే సంక్రాంతి నాటికి శ్రీరాంపురం చెరువులోకి గోదావరి జలాలను (Godavari Waters) విడుదల చేసేలా నాగుపల్లి సీతారామ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం గండుగులపల్లిలోని తన నివాసం నుంచి సీఈ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి పనుల పురోగతిపై (Project Progress) సమీక్షించారు. నాగుపల్లి సీతారామ కాలువకు సంబంధించి పెండింగ్ పనులను డిసెంబర్ నెలలోనే పూర్తి చేయాలని సూచించారు. కాలువ పనులు పూర్తయిన వెంటనే గోదావరి జలాలను శ్రీరాంపురం చెరువుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇటీవల కురిసిన వర్షాలు, తుఫాను కారణంగా దమ్మపేట మండలంలో గండ్లు పడిన చెరువుల పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. దెబ్బతిన్న చెరువులకు తక్షణమే మరమ్మతులు (Repair Works) చేపట్టాలని సూచించారు. మండలంలోని ప్రతి చెరువులో నీరు నిల్వ ఉండేలా అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సీఈ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల వెంట తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ రైతు సంఘం అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్, మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు