తుది దశకు ఎస్ఐఆర్
హుజురాబాద్‌పై స్పెషల్ ఫోకస్
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించే దిశగా చర్యలు
కరీంనగర్, అక్టోబరు 27 (విజయ క్రాంతి): ఎస్ఐఆర్ ప్రక్రియ(SIR Process) దాదాపు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో, మిగిలి ఉన్న పనులను రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్‌లో ఉన్న ఎస్ఐఆర్ నోటీసుల విచారణను(Inquiry into SIR notices) త్వరితగతిన పూర్తి చేసి, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను ముగించే పనిలో పడ్డారు. ఫారం-6 , 7 & 8 దరఖాస్తుల పరిశీలనతో(Scrutiny of applications) పాటు పెండింగ్ పనులను నవంబర్ 5వ తేదీ నాటికి పరిష్కరించాలని నిర్ణయించారు.
దరఖాస్తులకు సంబంధించిన అవసరమైన పత్రాలు, ఆధారాలను సక్రమంగా భద్రపరచనున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ చిత్ర మిత్ర నిర్ణయించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంలో లాజికల్ వ్యత్యాసాలు 202, మ్యాపింగ్ లేనివిగా 243 గా అధికారులు గుర్తించారు. ఈ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో అర్హత లేని ఓటర్లు నమోదైనందున దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎన్నికల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి స్వయంగా అన్ని పత్రాలను రీ-వెరిఫై చేయాలని, అర్హత లేని విభాగం కింద వచ్చే ప్రతి కేసుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలతో కూడిన ’మాట్లాడే ఉత్తర్వు’ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. భవిష్యత్తులో వచ్చే సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, రాజకీయ పార్టీల నుండి వచ్చే ఫిర్యాదులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరైన ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. హుజరాబాద్ నియోజకవర్గం లో మొత్తం ఓటర్లు 2,54,292 ఉండగా, డ్రాఫ్ట్ లో 28,225 ఓట్లు, డ్రాఫ్ట్ తర్వాత 446 ఓట్లు, 28 671 ఓట్లు తొలగించారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,25,621 ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో ఫారమ్ 6 (కొత్త ఓటరు నమోదు) మొత్తం 2875 దరఖాస్తులలో 2403 పెండింగ్‌లో ఉన్నాయి. ఫారమ్ 8 (సవరణలు/మార్పులు) మొత్తం 1666 దరఖాస్తులలో 1440 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ దరఖాస్తులను వెంటనే సహాయ ఓటర్ల నమోదు అధికారి వారీగా వర్గీకరించి గుర్తించాలని, ఏ ఏరియాలో ఎందుకు ఆలస్యమవుతుందో సమీక్షించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వారంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఉన్నందున స్వీకరించిన దరఖాస్తుల సమాచారం, వాటికి సంబంధించిన రసీదుల వివరాలను పార్టీల ప్రతినిధులకు సమర్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సహాయ ఎన్నికల అధికారులను ఆదేశించారు.