భార్యపై సుత్తితో దాడి.. హత్యాయత్నం కేసులో భర్త అరెస్ట్
మేడిపల్లి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): భార్యపై సుత్తితో పలుమార్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో నిందితుడైన భర్తను మేడిపల్లి పోలీసులు(Medipally Police) అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతాపూర్లోని గాంధీనగర్ కాలనీకి చెందిన ఘౌస్ పాషా ఖురేషీ (42) తన భార్య జైబున్ బేగం (28)ను 2021 లో రెండవ వివాహం చేసుకున్నాడు.
అప్పటి నుంచి కుటుంబంతో కలిసి పర్వతాపూర్లో నివాసం ఉంటున్నారు. భర్త మద్యం సేవించి తరచూ భార్యతో గొడవపడుతూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడని సమాచారం. ఈ క్రమంలో అక్టోబర్ 10వ తేదీ రాత్రి మద్యం సేవించి భార్యతో గొడవపడగా, వారి కుమారులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారు. అయితే అక్టోబర్ 11వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో జైబున్ బేగం వేరే గదిలో నిద్రిస్తున్న సమయంలో భర్త సుత్తితో ఆమె తలపై పలుమార్లు కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది.
వెంటనే కుమారులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బాధితురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు వేధింపులు, హత్యాయత్నానికి సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా బుధవారం నిందితుడు ఘౌస్ పాషా ఖురేషీని అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించినట్లు ఆరోపణ ఉన్న సుత్తిని స్వాధీనం చేసుకొని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని సిఐ జలంధర్ రెడ్డి తెలిపారు.